ప్రభాస్‌ను చూసి నేర్చుకోమన్న కేరళ మంత్రి

ప్రభాస్‌ను చూసి నేర్చుకోమన్న కేరళ మంత్రి

కేరళ వరదల నేపథ్యంలో తెలుగు, తమిళ సినీ పరిశ్రమల నుంచి ప్రముఖ నటీనటులంతా ఉదారంగా స్పందించారు. బాధితుల్ని ఆదుకునేందుకు పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటించారు. ముందుగా తమిళ స్టార్ బ్రదర్స్ సూర్య, కార్తి తలో రూ.25 లక్షల చొప్పున విరాళాలు ప్రకటించారు. ఆ తర్వాత కోలీవుడ్, టాలీవుడ్ నుంచి ఎందరో తారలు స్పందించారు. టాలీవుడ్ స్టార్లందరూ దాదాపు రూ.25 లక్షల చొప్పున విరాళాలు అందించారు.

ఐతే తెలుగు, తమిళ తారలతో పోలిస్తే కేరళ సెలబ్రెటీలు ఆశించిన స్థాయిలో స్పందించలేదన్న విమర్శలున్నాయి. ఇదే విషయమై కేరళ పర్యాటక మంత్రి కడకంపల్లి సురేంద్రన్ తమ స్టార్లను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ప్రభాస్‌ను ఉదాహరణగా చూపి అతడిని చూసి మలయాళ స్టార్లు నేర్చుకోవాలన్నారు.

ప్రభాస్‌కు కేరళతో ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ.. ఇక్కడి వరద బాధితుల్ని ఆదుకోవడానికి కోటి రూపాయల విరాళం ఇచ్చాడని.. కానీ తమ రాష్ట్రాలో రూ.3-4 కోట్ల విలువైన కార్లలో తిరుగుతూ.. అదే స్థాయిలో పారితోషకాలు అందుకునే స్టార్లు మాత్రం చాలా తక్కువ మొత్తంలో విరాళాలు ఇచ్చారని.. ప్రభాస్‌ను చూసి వీళ్లంతా నేర్చుకోవాలని సురేంద్రన్ అన్నాడు. మలయాళ నటి షీలా సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది.

పెద్ద మొత్తంలో పారితోషకాలు అందుకునే మలయాళ నటీనటులు ఎక్కువ విరాళాలు ఇవ్వాలని ఆమె అంది. ఐతే కేరళ మంత్రి అన్నట్లుగా ప్రభాస్ కోటి రూపాయల పారితోషకం ఇవ్వలేదు. అతను ఇచ్చింది రూ.25 లక్షలే. కానీ ఇది కూడా పెద్ద మొత్తమే. మలయాళంలో చాలా పెద్ద స్టార్ అయిన మోహన్ లాల్ సొంత రాష్ట్రం కోసం ఇచ్చింది కూడా 25 లక్షలే. మరోవైపు రాఘవ లారెన్స్.. విజయ్ కాంత్.. ఎ.ఆర్.రెహమాన్ తలో రూ.కోటి చొప్పున విరాళాలు ఇచ్చారు. విజయ్ రూ.70 లక్షలు విరాళంగా ప్రకటించాడు. 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు