ఔను.. అల్లుడిపై నాగ్ హ్యాండ్ పడింది

ఔను.. అల్లుడిపై నాగ్ హ్యాండ్ పడింది

అక్కినేని నాగార్జున ఎడిటింగ్ టేబుల్ దగ్గర కింగ్ అని అంటారు టాలీవుడ్ జనాలు. తన సినిమాల్నే కాక.. తన కొడుకుల సినిమాలవి కూడా రషెస్ చూసి ఆయన మార్పులు చేర్పులు సూచిస్తుంటారు. అవసరమైతే రీషూట్లు కూడా చేయిస్తుంటారు. రీషూట్లను చాలా నెగెటివ్‌గా చూసే ఆలోచనను మార్చిన వాళ్లలో నాగ్ ఒకడు.

‘సోగ్గాడే చిన్నినాయనా’.. ‘రారండోయ్ వేడుక చూద్దాం’ లాంటి సినిమాల రషెస్ చూసి.. వాటిలో మార్పులు చేర్పులు చేయించి అవి పెద్ద విజయం సాధించడానికి దోహదపడ్డాడు నాగ్. ఇవి రెండూ నాగ్ సొంత సినిమాలే. బయటి సినిమాల్లోనూ నాగ్ ప్రమేయం ఉంటోందని నాగచైతన్య వ్యాఖ్యల్ని బట్టి అర్థమవుతోంది.

చైతూ త్వరలోనే ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని కూడా చాలా ముందుగానే నాగ్ చూశాడట. కొన్ని సన్నివేశాల విషయంలో అభ్యంతరాలు చెప్పాడట. మరీ ఎక్కువ మార్పులు చేర్పులు చెప్పలేదని.. కానీ కొన్ని కీలకమైన పాయింట్లు చెప్పాడని చైతూ వెల్లడించాడు. ఆయన అభిప్రాయాలతో దర్శకుడు మారుతి.. ఇతర చిత్ర బృందం కూడా అంగీకరించిందని.. ఆ సన్నివేశాలకు కొంచెం టచప్స్ ఇవ్వడానికి సిద్ధమైందని చైతూ చెప్పాడు.

కేరళ వరదల కారణంగా రీరికార్డింగ్ పనులు ఆగిపోయి సినిమా వాయిదా పడిందని.. ఖాళీ దొరకడంతో తాము నాగ్ చెప్పినట్లుగా సన్నివేశాలు తీశామని చైతూ అన్నాడు. విడుదల తర్వాత తేడాగా ఉందని అనుకోవడం కంటే ముందే సర్దుబాట్లు చేసుకుంటే తప్పేముందన్న నాగ్ మాటల్ని కొడుకు కూడా బాగానే ఫాలో అవుతున్నట్లున్నాడు మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు