ఆ సినిమాలో సునీల్ హీరో కాదా?

ఆ సినిమాలో సునీల్ హీరో కాదా?

కమెడియన్‌గా తిరుగులేని ఇమేజ్ సంపాదించిన సునీల్.. తర్వాత హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. మొదట్లో ‘అందాల రాముడు’.. ‘మర్యాద రామన్న’.. ‘పూల రంగడు’ లాంటి సూపర్ హిట్లతో హీరోగా అతడి కెరీర్ దివ్యంగానే సాగింది. కానీ తర్వాత వరుస పరాజయాలతో సునీల్ పతనమైపోయాడు.

మాస్ ఇమేజ్ కోసం వెంపర్లాడి.. రెగులర్ హీరోల్లా ట్రై చేసి బోల్తా కొట్టాడు. చివరికి కామెడీ ఇమేజ్ పోయి.. హీరోగానూ పూర్తిగా ఫెయిలై ఎటూ కాని స్థితికి చేరుకున్నాడు. చివరికి తప్పనిసరి పరిస్థితుల్లో తిరిగి కమెడియన్ పాత్రలు చేయడానికి సై అన్నాడు. ‘అరవింద సమేత’.. ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ లాంటి సినిమాల్లో సునీల్ కామెడీ రోల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలు చేస్తూనే అల్లరి నరేష్‌తో కలిసి ‘సిల్లీ ఫెలోస్’ అనే చిత్రంలో నటించాడు సునీల్. ఈ సినిమా పోస్టర్లు అవీ చూస్తే నరేష్, సునీల్ ఇద్దరూ ఇందులో హీరోలని అందరూ అనుకుంటున్నారు. టైటిల్ ప్రకారం చూసినా ఇది ఇద్దరు హీరోల సినిమా అనిపిస్తోంది. కానీ నిజానికి ఇందులో నరేషే హీరోనట. సునీల్‌ది సహాయ పాత్ర అట. ‘సిల్లీ ఫెలోస్’ తమిళంలో విజయవంతమైన ‘వేలయను వందుట్టా వేలైక్కారన్’ చిత్రానికి రీమేక్ అట. అందులో విష్ణు విశాల్ హీరోగా నటించాడు.

ఆ చిత్రంలో అతనొక్కడే కథానాయకుడు. అతడి ఫ్రెండుగా సూరి నటించాడు. అది పక్కా కామెడీ క్యారెక్టర్. ఐతే సినిమాకు అదే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దాన్నే కొంచెం పెంచి సునీల్‌కు ఇచ్చారట. ఇంతకుముందు హీరో వేషాల విషయంలో చాలా పట్టుదలగా ఉన్న సునీల్.. ఇప్పుడు తనలాగే స్ట్రగుల్ అవుతున్న నరేష్ సినిమాలో కామెడీ క్యారెక్టర్ చేశాడంటే ఆశ్చర్యమే.
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు