దేవరకొండ సినిమాలో పెద్ద పెద్దోళ్లే..

దేవరకొండ సినిమాలో పెద్ద పెద్దోళ్లే..

చాలా వేగంగా స్టార్ ఇమేజ్ సంపాదించాడు విజయ్ దేవరకొండ. హీరోగా అతను నటించిన తొలి సినిమా ‘పెళ్ళిచూపులు’ అప్పట్లో రూ.25 కోట్ల దాకా షేర్ రాబట్టింది. ఆ తర్వాత ‘అర్జున్ రెడ్డి’ రూ.40 కోట్ల దాకా షేర్ తెచ్చుకుంది. ఇప్పుడు ‘గీత గోవిందం’ ఏకంగా రూ.60 కోట్ల మార్కును దాటేసింది. కానీ ఈ సినిమాలేవీ కూడా పెద్ద దర్శకులు తీసినవి కావు. వాటిలో స్టార్ కాస్ట్ కూడా గొప్పగా ఏమీ ఉండదు.

అందరూ చిన్న స్థాయి.. కొత్త ఆర్టిస్టులే నటించారు. ఐతే విజయ్ నటిస్తున్న కొత్త సినిమా ‘నోటా’ మాత్రం వీటికి భిన్నంగానే ఉండేలా కనిపిస్తోంది. ఈ రోజే ‘నోటా’ కొత్త పోస్టర్ వదిలారు. దానిపై విజయ్ కాకుండా మరో ఇద్దరు నటులు కనిపిస్తున్నారు. వాళ్లే సత్యరాజ్, నాజర్.

గొప్ప నటులు, అపార అనుభవజ్నులు అయిన సత్యరాజ్, నాజర్‌లకు అటు తమిళంలో, ఇటు తెలుగులో మాంచి డిమాండుంది. ‘బాహుబలి’ సినిమాతో వీళ్లిద్దరూ దేశవ్యాప్తంగా తిరుగులేని గుర్తింపు సంపాదించారు. ఇంత పెద్ద రేంజి నటులతో విజయ్ స్క్రీన్ షేర్ చేసుకుంటుండటం ఇదే తొలిసారి. మరి మంచి పెర్ఫామర్‌గా గుర్తింపు తెచ్చుకున్న విజయ్.. వీరి ముందు ఎలా తన ప్రత్యేకతను చాటుకుంటాడో చూడాలి. హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదాకు చోటివ్వకుండా వీరినే పోస్టర్లో చూపించారంటే సినిమాలో వీళ్లది కీలక పాత్రలు అనుకోవచ్చు.

ఈ చిత్రం రాజకీయాల నేపథ్యంలో సాగుతుందని టైటిల్‌ను బట్టే చెప్పేయొచ్చు. విజయ్ ఇందులో యువ రాజకీయ నాయకుడిగా.. తర్వాత సీఎంగా కనిపిస్తాడని అంటున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఆనంద్ శంకర్ దర్శకుడు. జ్నానవేల్ రాజా నిర్మాత. అక్టోబరు 4న రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఈ గురువారం సాయంత్రం 6 గంటలకు దీని ట్రైలర్ లాంచ్ అవుతుంది.