కంచరపాలెం.. అతి సర్వత్ర వర్జయేత్!

కంచరపాలెం.. అతి సర్వత్ర వర్జయేత్!

కొన్నిసార్లు సినిమాలకు అతి ప్రచారం కూడా చేటే చేస్తుంది. విడుదలకు ముందు సినిమా గురించి అతిగా చెప్పేస్తే ప్రేక్షకులు మరీ ఎక్కువ అంచనాలు పెంచుకుని థియేటర్లకు వెళ్తారు. ఆ అంచనాలకు ఏమాత్రం తక్కువగా ఉన్నా సినిమా గురించి నెగెటివ్‌గా మాట్లాడతారు.

ఇటీవల ‘శ్రీనివాస కళ్యాణం’ విషయంలో ఇలాగే జరిగింది. దిల్ రాజు సహా యూనిట్ సభ్యులంతా ఈ చిత్రం గురించి ఏ రేంజిలో చెప్పుకున్నారో తెలిసిందే. కానీ వాళ్లు చెప్పిన రేంజ్‌కి ఏమాత్రం దగ్గరగా కూడా సినిమా లేకపోవడంతో తొలి రోజు డివైడ్ టాక్ బాగా స్ప్రెడ్ అయిపోయింది.

ఆ చిత్రంతో పోలిక కాదు కానీ.. ఈ శుక్రవారం రిలీజ్ కానున్న ‘కేరాఫ్ కంచరపాలెం’ గురించి ఇండస్ట్రీ జనాలు చెబుతున్న మాటలు అంచనాల్ని మరీ పెంచేస్తున్నాయి. తెలుగు సినిమా స్థాయిని పెంచే సినిమా అని.. గత కొన్నేళ్లలో తెలుగులో వచ్చిన బెస్ట్ మూవీ అని.. సెలబ్రెటీలు ఓ రేంజిలో ఈ చిత్రం గురించి చెబుతున్నారు.

ఈ తరహాలో చిన్న సినిమాల్ని చేతుల్లోకి తీసుకుని ముందే సెలబ్రెటీలకు ప్రివ్యూల వేసి పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యేలా చూసి రిలీజ్ చేయడం సురేష్ బాబుకు అలవాటే. ‘పెళ్ళిచూపులు’ ఈ తరహాలోనే సూపర్ సక్సెస్ అయింది. కానీ తర్వాత ఇదే తరహాలో ‘మెంటల్ మదిలో’.. ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాల విషయంలోనూ చేశారు. కానీ విడుదలకు ముందు ఊదరగొట్టిన స్థాయిలో అవి లేకపోయాయి. దీంతో ప్రేక్షకులు నిరాశ చెందారు. సినిమాల ఫలితాలు కూడా తేడా కొట్టేశాయి. ‘కేరాఫ్ కంచెరపాలెం’ విషయంలోనూ ఇలా అవుతుందేమో అన్న సందేహాలు లేకపోలేదు.

ఇంతగా చెబుతున్నారంటే సినిమాలో ప్రత్యేకత లేకుండా పోదు. కానీ ఈ చిత్ర ప్రివ్యూలు ఒక ఉద్యమం లాగా నడుస్తున్నాయి. కొన్ని నెలలుగా సెలబ్రెటీలకు షోలు వేస్తూనే ఉన్నారు. తాజాగా ఒకేసారి చాలామంది సెలబ్రెటీల్ని రప్పించి షోలు వేశారు. వీళ్లందరూ సోషల్ మీడియాలో సినిమా గురించి ఓ రేంజిలో చెప్పేస్తుండటంతో జనాల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. నిజానికి ఈ చిత్రానికి ఇప్పటికే రావాల్సిన బజ్ వచ్చేసింది. విడుదల ముంగిట దాన్ని మరీ పెంచితే ప్రమాదమేమో చూస్కోవాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు