సూపర్ హీరోతో విక్టరీ వెంకటేష్

సూపర్ హీరోతో విక్టరీ వెంకటేష్

టాలీవుడ్లో మల్టీస్టారర్ ట్రెండుకు మళ్లీ ఊపు తెచ్చిన హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒకడు. తెలుగులో మల్టీస్టారర్లకు ఇక స్కోపే లేదనుకున్న సమయంలో మహేష్ బాబుతో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చేసి మిగతా హీరోల ఆలోచనలు మారేలా చేశాడు వెంకీ. ఆ తర్వాత యువ కథానాయకుడు రామ్‌తో కలిసి ‘మసాలా’ అనే మరో మల్టీస్టారర్ చేశాడు.

ఇప్పుడు మరో యంగ్ హీరో వరుణ్ తేజ్‌తో ‘ఎఫ్2’లో నటిస్తున్నాడు. దీని తర్వాత అక్కినేని నాగచైతన్యతో ‘వెంకీ మామ’ అనే సినిమా చేయబోతున్నాడు. తాజాగా వెంకీ హీరోగా మరో మల్టీస్టారర్‌కు రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇందులో వెంకీతో స్క్రీన్ షేర్ చేసుకునే హీరో ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నట వారసత్వంతో అరంగేట్రం చేసి.. చాలా వేగంగా నటుడిగా గొప్ప పేరు సంపాదించిన దుల్కర్ సల్మాన్‌తో వెంకీ కలిసి నటించబోతున్నాడట. ఈ చిత్రానికి దర్శక నిర్మాతలెవరన్నది ఇంకా వెల్లడి కాలేదు. ఐతే దుల్కర్‌తో వెంకీ కలిసి నటించబోతుండటం మాత్రం వాస్తవమట. తెలుగు, తమిళం, మలయాళం.. మూడు భాషల్లోనూ ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు సమాచారం.

త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడవుతాయి. మమ్ముట్టి వారసత్వంతో వచ్చాడు కానీ.. నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును చాలా త్వరగానే సంపాదించాడు దుల్కర్. మలయాళ సినిమాలతో అతను అనేక అవార్డులు అందుకున్నాడు. తమిళ, తెలుగు భాషల్లో ‘ఓకే బంగారం’, ‘మహానటి’ చిత్రాలతో తనదైన ముద్ర వేశాడు. బాలీవుడ్లోనూ ‘కార్వాన్’ సినిమాతో మెప్పించాడు. ఇలా అన్ని భాషల్లోనూ అతడికి పేరొచ్చింది. ఇప్పుడు వెంకీతో కలిసి నటిస్తే తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అవుతాడనడంలో సందేహం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English