‘అజ్ఞాతవాసి’ని గుర్తుకు తెస్తున్నాడుగా..

‘అజ్ఞాతవాసి’ని గుర్తుకు తెస్తున్నాడుగా..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాతో టాలీవుడ్లో సంగీత దర్శకుడిగా అరంగేట్రం చేసే అవకాశం అంటే అరుదైనదే. పైగా ఆ చిత్రానికి త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్ దర్శకత్వం వహిస్తే అది డబుల్ ధమాకా అన్నట్లే. ఇలాంటి అరుదైన అవకాశం తమిళ యువ సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్‌కే దక్కింది. వీళ్ల కాంబినేషన్లో వచ్చిన ‘అజ్ఞాతవాసి’కి మంచి హైప్ వచ్చింది.

ఆడియోతోనూ అనిరుధ్ మెప్పించాడు. కానీ ఏం లాభం..? సినిమా డిజాస్టర్ అయింది. అనిరుధ్‌పై నెగెటివ్ ముద్ర పడిపోయింది. దీంతో త్రివిక్రమ్ తర్వాతి సినిమా నుంచి అనూహ్య రీతిలో తప్పుకోవాల్సి వచ్చింది. ‘అజ్ఞాతవాసి’ కోసం తాను చేయాల్సిందల్లా చేశాడు అనిరుధ్. విడుదలకు ముందు పవన్ కళ్యాణ్‌కు ట్రిబ్యూట్‌గా గాలివాలుగా.. పాటతో అతను రూపొందించిన ప్రమోషనల్ వీడియోకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తెలుగు ప్రేక్షకులకు అది కొత్త అనుభూతిని పంచింది.

కానీ సినిమా పోవడంతో ఆ కష్టమంతా వృథానే అయింది. ‘అజ్ఞాతవాసి’ తర్వాత ఇటు చూడని అనిరుధ్.. మళ్లీ ఇదే తరహా ప్రమోషనల్ వీడియోతో మన జనాల్ని పలకరించడం విశేషం. సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘యు టర్న్’ సినిమా కోసం ‘అజ్ఞాతవాసి’ తరహాలోనే ఒక ప్రమోషనల్ వీడియో రూపొందించాడు అనిరుధ్. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్నదించకపోయినా.. సమంత కోరిక మేరకు ప్రమోషనల్ వీడియో చేశాడు.

కర్మ థీమ్ పేరుతో విడుదల చేసిన ఆ పాటను స్వయంగా పాడుతూ.. విజువల్స్‌లోనూ కనిపించాడు. ‘యు టర్న్’ తమిళంలోనూ ఒకేసారి రిలీజవుతుండటంతో అనిరుధ్‌తో ఇలాంటి పాట చేయించుకుంటే బాగుంటుందని సమంత అండ్ టీమ్ భావించింది. నయనతార కొత్త సినిమా ‘కోకో కోకిల’ కోసం అనిరుధ్ ఇలాంటి పాటే చేస్తే.. దానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మరి ‘యు టర్న్’ కోసం అనిరుధ్ చేసిన పాట సినిమా ప్రమోషన్‌కు ఏమాత్రం ఉపయోగపడుతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు