మూడో వారం.. అయినా మార్పు లేదు

మూడో వారం.. అయినా మార్పు లేదు

టాలీవుడ్ జనాలంతా గత వారం ముచ్చట్లే ఈ వారం కూడా మాట్లాడుకుంటున్నారు. ఆగస్టు 15న విడుదలైన ‘గీత గోవిందం’ తొలి వారంలో వసూళ్ల మోత మోగించి.. రెండో వారం కూడా పట్టు నిలుపుకున్న సంగతి తెలిసిందే. ‘నీవెవరో’.. ‘ఆటగాళ్ళు’.. ‘అంతకుమించి’.. ‘లక్ష్మి’.. వీటిలో ఏది కూడా కనీస ప్రభావం చూపలేకపోయాయి. ‘గీత గోవిందం’ ధాటికి ఇవి విలవిలలాడాయి. ఈ వారమైనా పరిస్థితి మారుతుందేమో అనుకుంటే.. అలా ఏమీ జరగలేదు.

ఈ వారాంతంలో ‘నర్తనశాల’.. ‘పేపర్ బాయ్’.. ‘కోకో కోకిల’ రిలీజయ్యాయి. వీటిలో ‘నర్తనశాల’ డిజాస్టర్ అని తొలి షోతోనే తేలిపోయింది. వసూళ్లు వెంటనే పడిపోయాయి. దాంతో పోలిస్తే మిగతా రెండు సినిమాలకు టాక్ పర్వాలేదు. కానీ వసూళ్లు మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. దీంతో ‘గీత గోవిందం’ అలాగే ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. వీకెండ్లో ఈ చిత్రానికి కొన్ని చోట్ల హౌస్ ఫుల్స్ పడుతుండగా.. చాలా చోట్ల 70-80 శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. మెయిన్ సెంటర్లలో దీనికి టికెట్లు దొరకడం కష్టంగా ఉంది.

కానీ కొత్త సినిమాల పరిస్థితి దయనీయంగా ఉంది. ఒక్కో షోకు ఈ మూడు సినిమాల వసూళ్లు కలిపితే కూడా ‘గీత గోవిందం’కు సమానంగా లేవంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ‘గీత గోవిందం’ గ్రాస్ రూ.100 కోట్లను దాటేసింది. షేర్ రూ.60 కోట్లకు చేరువగాఉంది. వీకెండ్ వసూళ్లు కూడా కలుపుకుంటే ఆ మార్కును దాటేయడం ఖాయం. అమెరికాలో ఈ చిత్రం 2.5 మిలియన్ మార్కుకు చేరువగా ఉంది. వచ్చే వారం వస్తున్నవి కూడా చిన్న సినిమాలే. అవైనా ‘గీత గోవిందం’ జోరును అడ్డుకుంటాయేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు