సుడిగాడు సీక్వెల్ లేదనేశాడు

సుడిగాడు సీక్వెల్ లేదనేశాడు

అల్లురి నరేష్‌ కెరీర్‌ను చిత్రమైన మలుపు తిప్పిన సినిమా ‘సుడిగాడు’. అది నరేష్ కెరీర్లోనే అతి పెద్ద హిట్. అతడి స్థాయికి మించి ఆడేసింది. కానీ ఆ సినిమా అంత పెద్ద హిట్టయినప్పటికీ.. దాని వల్ల నరేష్ కెరీర్ దెబ్బ తిన్న మాట కూడా వాస్తవం. అప్పటిదాకా నరేష్ తన ప్రతి సినిమాలోనూ వేరే హీరోల్ని ఒకట్రెండు సీన్లలో అనుకరిస్తుండేవాడు. అవి బాగానే ఉండేవి. కానీ ‘సుడిగాడు’ మొత్తం పేరడీలు, స్ఫూఫ్‌లతోనే నడిచింది.

డోస్ బాగా ఎక్కువైపోయింది. ఆ సినిమా వరకు బాగానే వర్కవుటైంది కానీ.. ఆ తర్వాత నరేష్‌కు అది చాలా ఇబ్బందిగా మారింది. అతను ఆపై పేరడీలు, స్ఫూఫ్‌లు చేస్తే జనాలకు మొహం మొత్తేసింది. ఇలాంటివి ఎన్నిసార్లు చూడలేదు అన్నట్లు ఫీలై పెదవి విరిచేశారు. దీంతో అతడి సినిమాలు వరుసగా బోల్తా కొట్టేశాయి.

ఐతే ‘సుడిగాడు’కు సీక్వెల్ వస్తుందంటూ ఆ తర్వాత కొంత ప్రచారం నడిచింది. కానీ అది కార్యరూపం దాల్చలేదు. మరోవైపు ‘సుడిగాడు’ మాతృక అయిన ‘తమిళ్ పడం’కి తమిళంలో ఆల్రెడీ సీక్వెల్ కూడా వచ్చేసింది. అది కూడా పెద్ద హిట్టయింది. ఈ నేపథ్యంలో భీమనేని శ్రీనివాసరావు-అల్లరి నరేష్ కలిసి దాన్ని రీమేక్ చేస్తారేమో అనుకుంటున్నారంతా. కానీ అందుకు అవకాశం లేదనేశాడు భీమనేని.

నరేష్-సునీల్ కాంబినేషన్లో ‘సిల్లీ ఫెలోస్’ అనే సినిమా తీసిన భీమనేని.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ‘సుడిగాడు’ సీక్వెల్ గురించి మాట్లాడాడు. జబర్దస్త్ లాంటి షోల వల్ల వినోదం ఇంటింటికీ చేరిపోయిందని.. ఇప్పుడు స్పూఫ్‌లు, పేరడీల ద్వారా నవ్వించడం చాలా కష్టమని భీమనేని అన్నాడు. అందుకుే వాటి జోలికి వెళ్లట్లేదని.. దీంతో పాటు తెలుగులో సీక్వెల్స్ ఆడిన దాఖలాలు కూడా పెద్దగా లేవని.. అందుకే ‘సుడిగాడు’ సీక్వెల్ ఆలోచనను విరమించుకున్నానని భీమనేని తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు