పవన్ కళ్యాణ్.. ఒక చిన్న ప్రేమకథ

పవన్ కళ్యాణ్.. ఒక చిన్న ప్రేమకథ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన 47వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడీ రోజు. ఆయన ఒకటికి మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఏయే పరిస్థితుల్లో పవన్ ఈ బంధాల్లోకి వచ్చాడో అందరికీ తెలుసు. ఐతే పవన్ జీవితంలో బయటికి వెల్లడి కాని మరో ప్రేమకథ ఉంది. అది పవన్ టేనేజీ రోజుల నాటి లవ్ స్టోరీ. దీని గురించి ఎప్పుడో ఒక సందర్భంలో పవన్ వివరించారు. ఇంటర్లోనే చదువు ఆపేసిన పవన్ మద్రాసులో ఉన్నపుడు కంప్యూటర్ క్లాసులకు వెళ్లేవాడట.

తనతో పాటు ఆ క్లాసుకు వచ్చే ఓ అందమైన అమ్మాయితో పవన్‌కు సాన్నిహిత్యం కుదిరిందట. ఆమె పవన్‌తో చాలా క్లోజ్‌గా ఉండేదట. బ్యాచ్ అయిపోయేకొద్దీ ఇద్దరి మధ్య చనువు పెరిగిందట. దీంతో పవన్ స్నేహితులు ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయమని ఒత్తిడి తెచ్చారట. పవన్ కూడా ధైర్యం తెచ్చుకుని ఆమెను ప్రేమిస్తున్నట్లు చెప్పేయాలనుకున్నాడట.

అందుకోసం ముహూర్తం చూసుకుని.. తమ ఇంట్లో ఎవరూ వాడకుండా పక్కన పడేసిన డొక్కు కారును శుభ్రం చేసి ఆ అమ్మాయిని కలవడానికి దాన్నే వేసుకెళ్లాడట. అప్పటికే ఉద్యోగం కూడా తెచ్చుకున్న ఆ అమ్మాయి దగ్గరికెళ్లి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని కార్లో ఎక్కించుకున్నాడట. మధ్యలో కారు ఆపి తన మనసులోని మాట ఇబ్బంది పడుతూనే చెప్పేశాడట. ఐతే అంతా విన్న ఆ అమ్మాయి.. అసలు ప్రేమంటే ఏంటి.. ఈ వయసులో ఇదేంటి అంటూ క్లాస్ పీకిందట.

ఆ అమ్మాయి ఆ సమయంలో తనకు క్లాస్ టీచర్‌ లాగా కనిపించింది అంటూ పవన్ సిగ్గుపడుతూ ఈ విషయాన్ని వెల్లడించాడు ఓ సందర్భంలో. మరి ఆ రోజు పవన్‌కు అలా క్లాస్ పీకిన ఆ అమ్మాయి.. అతను సినిమాల్లోకి వచ్చి పవర్ స్టార్ అయ్యాక ఎలా ఫీలైందో ఏమో మరి. ఏమైనప్పటికీ అంతర్ముఖుడైన పవన్ ఇలా తన ప్రేమను వెల్లడించడం విశేషమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు