దిల్ రాజు అతితో ఇంకో రెండు కోట్లు నష్టం

దిల్ రాజు అతితో ఇంకో రెండు కోట్లు నష్టం

ప్రమోషన్ అన్నిసార్లూ సినిమాను నిలబెట్టేయదు. బాగున్న సినిమాకు అది కొంచెం మేలు చేయొచ్చు కానీ.. ప్రేక్షకులకు రుచించని సినిమాకు ఎంత డబ్బా కొట్టినా వ్యర్థమే. అగ్ర నిర్మాత దిల్ రాజు కొత్త సినిమా ‘శ్రీనివాస కళ్యాణం’ విషయంలో ఇదే రుజువైంది. దీని కంటే ముందు రిలీజైన ‘లవర్’ సినిమా విషయంలో  తెలివితేటల్ని రాజు.. ‘శ్రీనివాస కళ్యాణం’ విషయంలో చూపించలేదని.. దాని వల్ల ఆయన అదనంగా రెండు కోట్ల దాకా నష్టపోయారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

‘లవర్’ సినిమాకు తొలి రోజే డివైడ్ టాక్ వచ్చింది. ఈ చిత్ర ఫలితం గురించి ముందే అంచనా వేశాడో ఏమో.. రాజు రిలీజ్ ముంగిట ప్రమోషన్ పెద్దగా చేయలేదు. రిలీజ్ తర్వాత అయితే పూర్తిగా దాన్ని వదిలేశాడు. సినిమాకు అసలే ఎక్కువ ఖర్చయిందని.. ఇక ప్రమోషన్ ఖర్చు దండగ అని ఆయన భావించాడు.

‘లవర్’ సినిమా థియేటర్లలో ఉండగానే ‘శ్రీనివాస కళ్యాణం’ ప్రమోషన్లు మొదలుపెట్టాడు. ఈ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజు.. తన బేనర్లో మరే సినిమాకూ లేని స్థాయిలో దీనికి ప్రమోషన్ చేశాడు. చాలా ఖర్చు పెట్టాడు. ‘శ్రీనివాస కళ్యాణం’కు తొలి రోజు డివైడ్ టాక్ వచ్చినా రాజు మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇటు టీవీల్లో.. అటు పత్రికల్లో ఉద్ధృతంగా ఇంటర్వ్యూలు ప్లాన్ చేశాడు. వేరే ఈవెంట్లు చేశాడు. భారీ ఖర్చుతో సక్సెస్ మీట్ పెట్టాడు.

థియేటర్లలో సర్వే అంటూ కార్డులు కొట్టించి హడావుడి చేశాడు. ఇలా ప్రమోషన్ల కోసం చాలానే ఖర్చయిందని.. అందువల్ల అదనంగా రూ.2 కోట్ల దాకా నష్టం మిగిలిందని అంటున్నారు. సినిమాను ముందే అమ్మేసుకున్నాడు కదా.. వేరే నష్టాలేమీ ఉండవనుకోవడానికి లేదు. రాజు డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాలు భిన్నంగా ఉంటాయి. ఆయన బయ్యర్లు ఫిక్స్డ్‌గా ఉంటారు. వాళ్లకే సినిమాలు అమ్ముతుంటారు. ఒక సినిమాలో లాస్ వస్తే.. ఇంకో సినిమాతో భర్తీ చేస్తారు. తక్కువ డబ్బులు కట్టించుకుంటారు. ఈ రకంగా ‘శ్రీనివాస కళ్యాణం’ వల్ల లాస్ అయిన బయ్యర్లకు ఆయన తర్వాత సెటిల్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ నష్టాన్ని రాజు భర్తిస్తున్నట్లే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు