ఆర్నెల్లలో అంతా తిరగబడిపోయిందే

ఆర్నెల్లలో అంతా తిరగబడిపోయిందే

కెరీర్ ఆరంభం నుంచి పడుతూ లేస్తూ సాగుతున్నాడు యువ కథానాయకుడు నాగశౌర్య. ఐదేళ్లుగా పరిశ్రమలో కొనసాగుతున్నా తనకంటూ ఒక ఇమేజ్ తెచ్చుకోలేదు. మార్కెట్ కూడా అంతగా సంపాదించుకోలేదు. అలాంటి తరుణంలో చాలా గ్యాప్ తీసుకుని.. సొంత బేనర్లో ‘ఛలో’ అనే సినిమా చేశాడు శౌర్య. ఈ చిత్రంపై ముందు పెద్దగా అంచనాల్లేవు.

రిలీజ్ ముంగిట కొంచెం బజ్ వచ్చింది. మంచి టైమింగ్‌ లో రిలీజ్ కావడం.. పోటీలో వచ్చిన ‘టచ్ చేసి చూడు’ తేలిపోవడం కలిసొచ్చి.. సినిమాకు టాక్ కూడా బాగుండటంతో చాలా పెద్ద హిట్టయిపోయిందా చిత్రం. పెట్టుబడి-రాబడి కోణంలో చూస్తే అది బ్లాక్ బస్టర్ అనే చెప్పాలి. ఈ సినిమాతో శౌర్యకు హీరోగా ఒక ఇమేజ్ వచ్చింది. అతడి మార్కెట్ పెరిగింది. ఐతే దీన్ని ఎలా సద్వినియోగం చేసుకుని తర్వాతి అడుగులు వేస్తాడన్నది కీలకంగా మారింది.

కానీ అప్పటికే కమిటైన రెండు సినిమాలు.. కొత్తగా ఒప్పుకున్న మరో సినిమా.. ఈ మూడు కూడా శౌర్యకు చేదు అనుభవాన్నే మిగిల్చాయి. లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘కణం’ వల్ల అతడికి ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. అది సక్సెస్ కాలేదు. పేరూ తేలేదు. మరోవైపు ‘అమ్మమ్మగారిల్లు’ అనే సెంటిమెంట్ మూవీ చేస్తే అదీ తేడా కొట్టేసింది. ఐతే ఇవి రెండూ ‘ఛలో’ కంటే ముందు ఒప్పుకున్న సినిమాలు కాబట్టి అతను చేయడానికేమీ లేకపోయింది. కానీ ‘ఛలో’ తర్వాత ఎన్నో లెక్కలేసుకుని మళ్లీ సొంత బేనర్లోనే చేసిన ‘నర్తనశాల’ ఫలితం మాత్రం అతడికి పెద్ద ఎదురు దెబ్బే.

‘కణం’.. ‘అమ్మమ్మగారిల్లు’ సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా దీనికి క్రేజ్ వచ్చింది. ప్రేక్షకులు అంచనాలు పెంచుకున్నారు. శౌర్య సైతం సినిమా బాగుంటేనే చూడండి. లేకుండా చూడొద్దు అంటూ పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చేశాడు. సినిమాను అగ్రెసివ్‌ గా ప్రమోట్ చేశాడు. సినిమా గురించి ప్రతి మాటలోనూ అతడి ఆత్మవిశ్వాసం కనిపించింది. తీరా చూస్తే అది అతి విశ్వాసమని తేలిపోయింది. శౌర్య చెప్పినదానికి.. సినిమాకు అసలు పొంతనే లేకపోయింది. ఈ చిత్రానికి దారుణమైన టాక్ వచ్చింది. తొలి రోజు సాయంత్రానికే వసూళ్లు పడిపోయాయి. ‘ఛలో’తో వచ్చిన క్రెడిబిలిటీ.. ఇమేజ్ అంతా పోగొట్టుకుని ఆరు నెలల్లో మళ్లీ యథా స్థితికి వచ్చేశాడు శౌర్య.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు