పందెం కోడి ఫూల్ చేశాడుగా..

పందెం కోడి ఫూల్ చేశాడుగా..

తెలుగువాడైన తమిళ కథానాయకుడు విశాల్‌కు తెలుగులో మంచి గుర్తింపు తెచ్చిన సినిమా ‘పందెం కోడి’. తమిళంలో అతడికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన సినిమా కూడా ఇదే. తెలుగులో మళ్లీ ఆ స్థాయి సక్సెస్ విశాల్‌కు రాలేదు. ‘అభిమన్యుడు’ ఒక్కటి దానికి దగ్గరగా వచ్చింది. సరిగ్గా ‘పందెంకోడి-2’ రావడానికి ముందే ‘అభిమన్యుడు’ బాగా ఆడి విశాల్‌కు మళ్లీ క్రేజ్ తీసుకురావడం కలిసొచ్చే విషయమే. దీన్ని క్యాష్ చేసుకుని ‘పందెం కోడి-2’ బాగా ప్రమోట్ చేసి పెద్ద ఎత్తున రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

ఠాగూర్ మధు లాంటి పెద్ద నిర్మాత ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతుండటం విశేషం. తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్.. ఫస్ట్ టీజర్ వదిలారు. కానీ ఈ టీజర్ చూసిన వాళ్లు ఒకింత నిరాశకు గురవుతున్నారు. అంటే ఈ టీజర్ బాలేదనేమీ కాదు. ఇది బాగా పాతబడిపోవడమే అందుక్కారణం.

ఇప్పుడు రిలీజ్ చేసిన ‘పందెంకోడి’ తెలుగు టీజర్.. తమిళంలో మూడు నెలల కిందటే రిలీజైంది. ‘పందెంకోడి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులు కూడా బాగా కనెక్టయ్యారు కాబట్టి ఈ టీజర్ రిలీజైనపుడు సోషల్ మీడియాలో జరిగిన హడావుడితో చాలామంది దాన్ని చూసేశారు. ఆ టీజర్ వదిలేటప్పటికీ తెలుగు హక్కుల అమ్మకం జరగలేదు. డబ్బింగ్ పనులూ మొదలు కాలేదు.

కొన్ని రోజుల గ్యాప్‌లో తెలుగు టీజర్ వదిలితే ఓకే కానీ.. మూణ్నెల్ల గ్యాప్ తీసుకున్నపుడు తెలుగు వారి కోసం కొత్త టీజర్ ఏదైనా కట్ చేయాల్సింది. కనీసం ఉన్నదాంట్లోనే కొత్త షాట్లు వేయాల్సింది. కానీ అదేమీ లేకుండా పాత టీజర్ వదిలారు. పైగా దీనికి కొన్ని రోజుల నుంచి కౌంట్ డౌన్ కూడా నడిపించారు. ఇంత హంగామా చేసినపుడు ఏమైనా కొత్తదనం ఉంటుందని చూసిన వాళ్లు ఫూల్స్ అయిపోయారు. ఆ సంగతలా వదిలేస్తే ‘పందెంకోడి’ తరహాలోనే సీక్వెల్ కూడా మాస్ ప్రేక్షకులకు మంచి వినోదం పంచుతుందన్న అంచనాలున్నాయి. అక్టోబరు 18న రెండు భాషల్లో ఒకేసారి ఈ చిత్రం విడుదల కానుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు