బ్యాంకు వ‌రుస సెల‌వుల‌పై క్లారిటీ!

బ్యాంకు వ‌రుస సెల‌వుల‌పై క్లారిటీ!

సెప్టెంబ‌రు మొద‌టి వారంలో వ‌రుస‌గా 5 రోజుల పాటు బ్యాంకులు మూత‌ప‌డ‌బోతున్నాయంటూ గ‌త రెండు రోజులుగా సోష‌ల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. సెప్టెంబర్ 2 ఆదివారం సెలవు, సెప్టెంబర్ 3 జన్మాష్టమి.  ఆ తరువాత 4, 5 తేదీల్లో బ్యాంక్ ఉద్యోగులు సమ్మె  చేపట్టనున్నారనీ వ‌దంతులు వ‌స్తున్నాయి. ఆ త‌ర్వాత రెండు రోజులు బ్యాంకులు ప‌నిచేసినా 8, 9 తేదీలు రెండవ శనివారం, ఆదివారం కావడంతో వరుస సెలవులంటూ మెసేజ్ లు స‌ర్క్యులేట్ అవుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో ఆ వార్త‌ల‌పై జాతీయ బ్యాంక్ ఉద్యోగుల సంఘం నేతలు స్పందించారు. వాట్సాప్‌, ఫేస్ బుక్ త‌దిత‌ర సోష‌ల్ మీడియా ప్లాట్ ఫార‌మ్ ల‌లో   షేర్‌ అవుతున్న మెసేజ్ లను వారు ఖండించారు. ఆ వ‌దంతుల్లో వాస్త‌వాలు లేవ‌ని ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని బ్యాంక్ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడు అశ్వానీ రాణా చెప్పారు.

ఏటీఎంలలో స‌రిప‌డా నగదు ఉండ‌బోద‌ని, బ్యాంకింగ్ వ్యవస్థ స్తంభించిపోనుందని వ‌స్తోన్న వార్త‌లు నిజం కాద‌ని చెప్పారు. ఆ మాట‌కొస్తే బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం వరుసగా 3రోజులకు మించి సెలవులు ఉండే అవ‌కాశం లేద‌ని స్పష్టం చేశారు.  4, 5 తేదీల్లో సమ్మె చేపట్టనుంది కేవలం రిజర్వు బ్యాంక్ ఉద్యోగులు మాత్రమేనని, దానితో బ్యాంకు ఉద్యోగుల‌కు సంబంధం లేద‌ని చెప్పారు. ఆ సమ్మె ప్ర‌భావం బ్యాంకింగ్ వ్యవస్థపై  ఉండదని తెలిపారు. ఆ స‌మ్మె తేదీల్లో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులన్నీ యథావిధిగా పనిచేస్తాయన్నారు.

దాంతోపాటే, జన్మాష్టమి ఆప్ష‌న‌ల్ హాలిడే అని, దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కొన్ని బ్యాంకులకు మాత్రమే సెప్టెంబర్ 3న సెలవు అని తెలిపారు. ఢిల్లీ, ముంబై తదితర ప్రాంతాల్లో ఆ రోజు బ్యాంకులు తెరిచే ఉంటాయన్నారు. మ‌రోవైపు, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం జన్మాష్టమి సందర్భంగా చాలా బ్యాంకులు సోమవారం సెలవు ప్రకటించాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English