ఆ నటుడి పారితోషకం ఒక్క రూపాయి

ఆ నటుడి పారితోషకం ఒక్క రూపాయి

కథ.. పాత్ర నచ్చితే పారితోషకం తగ్గించుకుని నటించే ఆర్టిస్టులను చూస్తుంటాం. కానీ పారితోషకాన్ని మరీ రూపాయికి తగ్గించుకునేవాళ్లు అరుదుగా ఉంటారు. బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖి ఈ కోవలోకే చేరాడు. ఎన్నో విలక్షణమైన పాత్రలతో నటుడిగా గొప్ప పేరు సంపాదించిన నవాజ్.. తాజాగా ‘మాంటో’ అనే విభిన్నమైన సినమాలో నటించాడు. ఈ చిత్రానికి ప్రముఖ నటి నందితా దాస్‌ దర్శకత్వం వహించడం విశేషం. ప్రముఖ రచయిత సదత్‌ హాసన్‌ మాంటో జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని ఆమె రూపొందించారు. ఈ సినిమాకు నవాజుద్దీన్ కేవలం రూపాయి పారితోషకమే తీసుకున్నట్లు స్వయంగా నందితానే వెల్లడించింది.

‘మాంటో’ కథ చెప్పగానే ఈ సినిమాకు గాను తనకు ఒక్క రూపాయి పారితోషికం చాలని నవాజు చెప్పాడని నందిత వెల్లడించింది. ఈ చిత్రంలో మిగతా కీలక పాత్రల్లో నటించిన రిషి కపూర్‌, పరేశ్‌ రావల్‌, రణ్‌వీర్‌ షోరే, దివ్యా దత్తా, జావేద్‌ అఖ్తర్‌.. వీళ్లందరూ అసలు పారితోషకమే తీసుకోలేదని నందిత వెల్లడించింది. మంచి పాత్రల కోసం ఎదురుచూస్తున్న నటీనటులు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారని.. వారితో కలిసి పనిచేస్తే కలిగే ఆనందం ముందు డబ్బుకు విలువలేదని నందితా పేర్కొంది.

నటిగా ఎన్నో అవార్డు సినిమాల్లో నటించిన నందిత.. దర్శకురాలిగా కూడా అలాంటి సినిమానే చేస్తున్నట్లుగా ఉంది. ఈ చిత్రం ఇప్పటికే కొన్ని అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై ప్రశంసలందుకుంది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్లో నవాజుద్దీన్‌ను చూస్తే షాకవ్వాల్సిందే. మాంటో పాత్రం కోసం అతను భలేగా అవతారం మార్చుకున్నాడు. త్వరలోనే ఈ చిత్రాన్ని ఇండియాలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. మరోవైపు శివసేన మాజీ అధ్యక్షుడు బాల్ థాకరే జీవిత కథతో తెరకెక్కుతున్న సినిమాలోనూ నవాజ్ ప్రధాన పాత్ర చేస్తున్నాడు. ఆ గెటప్‌కు కూడా అదిరిపోయే స్పందన వచ్చింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు