నేనా.. హృతిక్ రోషన్‌తో డేటింగా?

నేనా.. హృతిక్ రోషన్‌తో డేటింగా?

హృతిక్ రోషన్‌తో కంగనా రనౌత్‌ గొడవ గురించి జనాలు ఇంకా మరిచిపోలేదు. ఈలోపే మరో హీరోయిన్‌తో హృతిక్ రోషన్‌కు విభేదాలంటూ వస్తున్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. తెలుగులో ‘లోఫర్’ సినిమా చేసిన ముంబయి భామ దిశా పఠానికి, హృతిక్ రోషన్‌కు ఒక కొత్త సినిమా చిత్రీకరణ ముందే గొడవ జరిగిందని.. ఆమెను హృతిక్ డేటింగ్‌కు పిలిచాడని బాలీవుడ్ మీడియాలో కొన్ని రోజులుగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ విషయమై హృతిక్ రోషన్, దిశా పఠాని తీవ్రంగా స్పందించారు. ఇలాంటి చీప్ వార్తలు వార్తలు ప్రచురించవద్దని హెచ్చరించారు.

ఇంతకీ విషయం ఏంటంటే..ఇప్పటిదాకా చిన్న స్థాయి హీరోలతోనే జత కడుతూ వచ్చిన  దిశా.. తొలిసారిగా హృతిక్‌ రోషన్‌ లాంటి పెద్ద హీరో సరసన ఒక చిత్రానికి ఎంపికైంది. ఐతే ఈ సినిమా మొదలవడానికిి ముందు తనతో డేటింగ్‌కు రావాలని.. లేదంటే సినిమాలో ఛాన్సుండదని హృతిక్‌ దిశాను బెదిరించాడంటూ రెండు ప్రముఖ హిందీ పత్రికలు వార్తలు ప్రచురించాయి. అవి రెండూ పెద్ద పత్రికలు కావడంతో వెంటనే హృతిక్‌, దిశా ట్విటర్‌ ద్వారా స్పందించారు. ‘‘మీకు పాపులారిటీ కావాలంటే నన్నే నేరుగా అడగొచ్చు కదా? ఇలాంటి అసభ్య, అవాస్తవ వార్తలు ప్రచురించడం ఎందుకు?’’ అంటూ హృతిక్ మండిపడ్డాడు.

మరోవైపు దిశా స్పందిస్తూ.. ‘‘నా గురించి, హృతిక్‌ సర్‌ గురించి అర్థంలేని వార్తలు వస్తున్నాయి. వాటిలో ఎలాంటి వాస్తవం లేదు. నేను ఆయన్ని కలిసినప్పుడు ఎంతో మర్యాదగా మాట్లాడారు. అంత గొప్ప వ్యక్తి గురించి వస్తున్న వార్తలను ఖండించాల్సిన బాధ్యత నాపై ఉంది. ఆయనతో కలిసి నటిస్తున్న సినిమా నుంచి నేను తప్పుకోవడంలేదు’’ అని స్పష్టం చేసింది. వీరి స్పందన నేపథ్యంలో సదరు పత్రికలు ఏమంటాయో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు