సూర్య ఔట్.. విజయ్‌కి బంపరాఫర్

సూర్య ఔట్.. విజయ్‌కి బంపరాఫర్

తమిళ స్టార్ హీరో సూర్యకు సరైన సినిమా పడి చాలా కాలం అయిపోతోంది. అతడి ప్రతి సినిమాకూ మంచి క్రేజ్ వస్తోంది. అంచనాలు పెరుగుతున్నాయి. కానీ ఆ అంచనాలకు తగ్గట్లుగా సినిమాలు ఉండట్లేదు. చివరగా ఈ ఏడాది సంక్రాంతికి ‘గ్యాంగ్’ సినిమాతో పలకరించాడు సూర్య. ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో ఓ మోస్తరుగా ఆడిందంతే. ఐతే ఇప్పుడు సూర్య చేస్తున్న సినిమాలు మాత్రం చాలా ఎగ్జైట్మెంట్ కలిగిస్తున్నాయి. విలక్షణ దర్శకుడు సెల్వ రాఘవన్ దర్శకత్వంలో అతను నటిస్తున్న ‘ఎన్జీకే’పై అంచనాలు మామూలుగా లేవు. ఈ కాంబినేషనే చాలా ఉత్కంఠ రేపుతోంది. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలనుకున్నారు. ఇంతకుముందే డేట్ కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు ఉన్నట్లుండి ఈ చిత్రం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.


సూర్య-సెల్వ సినిమా భారీతనంతో కూడుకున్నదని.. ఈ చిత్రాన్ని పూర్తి చేయడానికి మరింత సమయం అవసరమని.. కాబట్టి దీపావళికి ‘ఎన్జీకే’ విడుదల కాదని చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. బహుశా ఈ చిత్రాన్ని క్రిస్మస్ వీకెండ్లో రిలీజ్ చేస్తారని భావిస్తున్నారు. సూర్య సినిమా రేసు నుంచి తప్పుకోవడంతో దీపావళికి షెడ్యూల్ అయిన మరో భారీ సినిమా ‘సర్కార్’ పంట పండినట్లే. ‘తుపాకి’, ‘కత్తి’ తర్వాత విజయ్-మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు మామూలుగా లేవు. రోజు రోజుకూ ఈ చిత్రంపై హైప్ పెరుగుతోంది. ఇలాంటి సమయంలో సూర్య సినిమా నుంచి పోటీ తప్పడం దీనికి మరింతగా కలిసి రాబోతోంది. తమిళులు దీపావళిని చాలా ప్రత్యేకంగా భావిస్తారు. సంక్రాంతి తర్వాత అంతగా సినిమాల సందడి ఉండేది దీపావళికే. ప్రతి ఏడాదీ ఆ పండక్కి రెండు మూడు భారీ సినిమాలు రిలీజవుతాయి. ఈసారి మాత్రం విజయ్ సినిమా సోలోగా బరిలోకి దిగేస్తోంది. సినిమా అంచనాలకు తగ్గట్లు ఉంటే మాత్రం ‘సర్కార్’ వసూళ్ల మోత మోగించడం ఖాయంగా కనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు