అవును.. క్రిష్ కాదు.. కంగనానే డైరెక్టర్

అవును.. క్రిష్ కాదు.. కంగనానే డైరెక్టర్

ఇక సందేహాలేమీ అక్కర్లేదు. కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్నదే నిజమని తేలిపోయింది. ‘మణికర్ణిక’ సినిమా విషయంలో మన క్రిష్‌ను పక్కన పెట్టినట్లే ఉన్నారు. క్రిష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ఈ చిత్రం అనుకున్న సమయానికి పూర్తి కాలేదు. ఈ ఏడాది ప్రథమార్ధంలోనే రావాల్సిన ఈ చిత్రం వచ్చే ఏడాదికి వాయిదా పడింది. కొన్ని ఎపిసోడ్ల విషయంలో హీరోయిన్ కంగనా రనౌత్‌, నిర్మాతలు సంతృప్తి చెందలేదని.. ఈ విషయమై కంగనకు, క్రిష్‌కు విభేదాలు తలెత్తాయని.. దీంతో క్రిష్ ఈ చిత్రాన్ని వదిలేసి వచ్చేశారని.. కంగనా డైరెక్షన్లో కొన్ని సీన్లు రీషూట్ చేస్తున్నారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఐతే క్రిష్‌తో తనకు విభేదాలేమీ లేవని, తామిద్దరం తరచుగా మాట్లాడుకుంటున్నామని కంగనా ఒక ఇంటర్వ్యూలో వివరణ కూడా ఇచ్చింది.


కానీ వాస్తవం చూస్తే మరోలా ఉంది. తాజాగా ‘మణికర్ణి’క షూటింగ్ సందర్భంగా సెట్‌లోని క్లాప్‌బోర్డ్‌ ఫొటో ఒకటి సోషల్‌మీడియాలోకి వచ్చింది. ఆ క్లాప్‌బోర్డ్‌లో ‘డైరెక్టర్’ స్థానంలో క్రిష్‌ అని కాకుండా కంగన అని ఉంది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ‘మణికర్ణిక’కు దర్శకురాలు కంగనానా అంటూ ఆశ్చర్యపోవడం తెలుగు జనాల వంతైంది. ఐతే దీనిపై చిత్ర బృందం వివరణ ఇచ్చింది. ‘‘మణికర్ణిక’ సినిమాకు దర్శకుడు ఎప్పటికీ క్రిష్‌యే. ప్రస్తుతం ఆయన మరో సినిమాతో బిజీగా ఉండడంతో ‘మణికర్ణిక’ సినిమాలో కొన్ని ప్యాచ్‌ వర్క్స్‌ మిగిలిపోయాయి. అనుకున్న తేదీకి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు గాను కంగన దర్శకత్వ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు. సెట్లో ఎలాంటి కన్‌ఫ్యూజన్‌ లేకుండా ఉండేందుకు క్లాప్‌ బోర్డ్‌పై దర్శకుడి పేరును క్రిష్‌కు బదులు కంగన అని రాశాం’’ అని వివరించారు. ఐతే ‘మణికర్ణిక’ టీం ఎలా కవర్ చేయాలని చూసినా.. కంగనా ఇప్పుడు ‘మణికర్ణిక’లోని సన్నివేశాల్ని డైరెక్ట్ చేస్తున్న మాట వాస్తవం. ఎంత ప్యాచ్ వర్క్ అయితే మాత్రం క్రిష్ లాంటి మంచి దర్శకుడిని పక్కన పెట్టి కంగనానే డైరెక్ట్ చేసుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు