ఆ పాత్ర బాగా చేయలేకపోయాన్న హరికృష్ణ

ఆ పాత్ర బాగా చేయలేకపోయాన్న హరికృష్ణ

రెండు రోజుల కిందటే రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన నందమూరి హరికృష్ణది సినిమాల్లో చిన్న కెరీరే. నందమూరి తారక రామారావు ఘన వారసత్వాన్నందుకుని సినీ రంగ ప్రవేశం చేసిన  హరికృష్ణకు  చేసిన సినిమాలు చాలా తక్కువ. కానీ చేసిన కొన్ని సినిమాలతోనే తనదైన ముద్ర వేయగలిగారు. బాలనటుడిగా ‘కృష్ణావతారం’ సినిమాతో తెరంగేట్రం చేసిన హరికృష్ణ.. ఆ తర్వాత తన తండ్రి.. సోదరుడు బాలకృష్ణతో కలిసి ‘తాతమ్మ కల’లోనూ నటించాడు. యుక్త వయసుకు వచ్చాక హరికృష్ణ చేసిన పెద్ద పాత్ర ‘దాన వీర శూర కర్ణ’లోని అర్జునుడిది. ఐతే ఈ పాత్ర విషయంలో హరికృష్ణ స్వయంగా అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. తాను ఆ పాత్రను సరిగా పండించలేకపోయానని ఒక సందర్భంలో నిజాయితీగా చెప్పేశాడు హరికృష్ణ.

నిజానికి ఈ పాత్రకు ముందు హరికృష్ణను అనుకోలేదట. మరో నటుడిని అనుకున్నారట. ఐతే ఆ నటుడు సమయానికి అందుబాటులోకి రాకపోయేసరికి హరికృష్ణతో వేషం చేయించేశారట ఎన్టీఆర్. అప్పటికే ఈ చిత్రానికి సంబంధించి చాలా బాధ్యతలు చూస్తున్నాడు హరికృష్ణ. ‘దాన వీర శూర కర్ణ’కు ఎన్టీఆరే దర్శకుడు, నిర్మాత కూడా. ఆర్టిస్టుల మేకప్ దగ్గర్నుంచి అనేక బాధ్యతల్ని ఆయన చూసుకునేవారు. హరికృష్ణ నిర్మాణ బాధ్యతలన్నీ నెత్తిన వేసుకున్నారు. ఆ పనుల్లో తీరిక లేకుండా ఉండగానే అర్జునుడి పాత్ర వేయమని ఎన్టీఆర్ అన్నారు. తండ్రి మాట కాదనలేక ఆ పాత్ర చేశాను కానీ.. దానికి సరైన మేకప్ కుదరలేదని, తన నటన కూడా దానికి సరిపోలేదని హరికృష్ణ ఓ సందర్భంలో స్పష్టం చేశాడు. నిర్మాణ పనుల్లో ఒత్తిడి వల్లే ఆ పాత్రకు న్యాయం చేయలేకపోయానని ఆయన అభిప్రాయపడ్డారు. హరికృష్ణ ఎంతటి ముక్కుసూటి మనిషో చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ ఇంకేం కావాలి?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు