కుర్రాడికి అసలు పరీక్ష ఇప్పుడు..

కుర్రాడికి అసలు పరీక్ష ఇప్పుడు..

కెరీర్లో చిన్న చిన్న అడుగులు వేస్తూ సాగిన నాగశౌర్య.. ‘ఛలో’ సినిమాతో ఒకేసారి పెద్ద అడుగు వేసేశాడు. నాగశౌర్యపై రూ.5 కోట్ల లోపు బడ్జెట్ పెట్టినా రికవరీ కష్టం అనుకున్న టైంలో ‘ఛలో’ సినిమా రూ.10 కోట్లకు పైగా థియేట్రికల్ షేర్ సాధించి ఆశ్చర్యపరిచింది.

సొంత బేనర్లో తన మార్కెట్ స్థాయికి మించిన ఖర్చుతో ఈ సినిమా తీసి సాహసం చేసిన శౌర్యకు మంచి ఫలితమే దక్కింది. కాకపోతే ‘ఛలో’ కంటెంట్ పరంగా గొప్ప సినిమా ఏమీ కాదు. అది రిలీజైన టైమింగ్ బాగా కలిసొచ్చింది. రవితేజ చిత్రం ‘టచ్ చేసి చూడు’ డిజాస్టర్ దీనికి మేలు చేసింది. సినిమాకు వచ్చిన టాక్‌ తో పోలిస్తే వసూళ్లు ఎక్కువే వచ్చాయి. మంచి లాభాలు ఆర్జించిన శౌర్య తల్లిదండ్రులు.. దీని తర్వాత మరింత ఎక్కువ ఖర్చుతో ‘నర్తనశాల’ తీశారు. ‘ఛలో’ మాదిరే ఈ చిత్రంతో శ్రీనివాస్ చక్రవర్తి అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు.

‘ఛలో’ తర్వాత శౌర్య నుంచి వచ్చిన ‘కణం’.. ‘అమ్మమ్మగారిల్లు’ ఫ్లాప్ అయ్యాయి. అయినప్పటికీ ‘నర్తనశాల’కు హైప్ బాగానే వచ్చింది. ‘కణం’.. ‘అమ్మమ్మగారిల్లు’ సినిమాల్ని శౌర్య పెద్దగా పట్టించుకున్నట్లు కూడా కనిపించలేదు. ‘నర్తనశాల’ మీద మాత్రం చాలా ఫోకస్ పెట్టాడు. అగ్రెసివ్ గా సినిమాను ప్రమోట్ చేశాడు. చాలా ధీమా చూపించాడు.

‘శైలజారెడ్డి అల్లుడు’ 31న వచ్చేట్లున్నా కూడా పర్వాలేదని ముందు రోజు ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి రెడీ అయ్యాడు. ఐతే ఎన్ని చేసినా సినిమాలో ఏమాత్రం విషయం ఉందన్నది ముఖ్యం. ‘ఛలో’ విజయం గాలివాటం అనే వాళ్లకు అతను ఇప్పుడు సమాధానం చెప్పాల్సి ఉంది. తన జడ్జిమెంట్ స్కిల్స్ చూపించాలి. బాక్సాఫీస్ స్టామినా ఎలాంటిదో చాటిచెప్పాలి. ఈ చిత్రానికి ఓపెనింగ్స్ బాగానే వచ్చే అవకాశముంది కానీ.. సినిమాలో విషయం ఉంటేనే నిలబడుతుంది. మరి ‘నర్తనశాల’ ఫలితమెలా ఉంటుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు