జేమ్స్ బాండ్ సినిమా నుంచి అతను ఔట్

జేమ్స్ బాండ్ సినిమా నుంచి అతను ఔట్

భారతీయ స్వర సంచలనం ఏఆర్ రెహమా‌న్‌కు రెండు ఆస్కార్ అవార్డులు తెచ్చిపెట్టని సినిమా ‘స్లమ్ డాగ్ మిలియనీర్’. రెహమాన్‌‌కే కాదు.. మొత్తంగా ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డుల పంట పండించాడు దర్శకుడు డానీ బోయెల్.

దీని తర్వాత ‘127 అవర్స్’ అనే మరో విభిన్న సినిమా చేశాడు ఈ బ్రిటిష్ దర్శకుడు. అతడికి ప్రతిష్టాత్మక జేమ్స్ బాండ్ సినిమాకు కూడా దర్శకత్వం వహించే అవకాశం లభించింది. ఇప్పటికే నాలుగు బాండ్ సినిమాలు చేసిన డేనియెల్ క్రెయిగ్ హీరోగా కొన్ని నెలల కిందటే కొత్త జేమ్స్ బాండ్ సినిమాను మొదలుపెట్టాడు బోయెల్. ఐతే ఇప్పుడు అనూహ్యంగా బోయెల్ ఈ సినిమా నుంచి తప్పుకోవడం సంచలనం రేపుతోంది. హీరో డేనియల్ క్రెయిగ్‌తో విభేదాల వల్లే డానీ ఈ చిత్రం నుంచి తప్పుకోవాల్సి వచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

జేమ్స్ బాండ్ కొత్త సినిమా కథ విషయంలో డేనియల్‌కు, బోయెల్‌కు అంగీకారం కుదరలేదట. బోయెల్ స్క్రీన్ ప్లే విషయంలో డేనియల్ అభ్యంతరం చెప్పాడట. అంతే కాక హీరో పాత్రను మార్చమని.. చివర్లో బాండ్‌ను చంపేయమని అన్నాడట. ఈ మార్పులకు అంగీకరించని బోయెల్.. చివరికి సినిమా నుంచి తప్పుకున్నట్లు హాలీవుడ్ మీడియా చెబుతోంది. బోయెల్ వైదొలగడంతో నిర్మాణ సంస్థ ప్రణాళికలన్నీ మారిపోయాయి. మళ్లీ ఇప్పుడు ఇంకో దర్శకుడిని ఎంచుకుని.. అతను స్క్రిప్టును ఆకళింపు చేసుకుని.. సినిమా తీయాల్సి ఉంది.

దీంతో అనుకున్న ప్రకారం వచ్చే ఏడాది బాండ్ కొత్త సినిమా వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. నిజానికి బాండ్‌గా కొనసాగడం డేనియల్‌కు అసలేమాత్రం ఇష్టం లేదన్న సంకేతాలు ముందు నుంచి వస్తున్నాయి. బాండ్ సిరీస్‌లో వచ్చిన చివరి సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇకపై ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చినా బాండ్‌గా నటించని.. ఈ సినిమాలు చేయడం నరకమని వ్యాఖ్యానించాడతను. ఐతే అతడిని అతి కష్టం మీద ఒప్పించి కొత్త సినిమా చేస్తోంది నిర్మాణ సంస్థ. బోయెల్‌తో గొడవ నేపథ్యంలో క్రెయిగ్‌తో నిర్మాణ సంస్థ మరో బాండ్ సినిమా తీసే అవకాశాలు కనిపించడం లేదు.


 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు