నాని సినిమా రీమేక్.. హీరోగా తెలుగోడే

నాని సినిమా రీమేక్.. హీరోగా తెలుగోడే

నేచురల్ స్టార్ నాని కెరీర్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ సినిమాల్లో ‘నిన్ను కోరి’ ఒకటి. ‘భలే భలే మగాడివోయ్’తో కెరీర్ ఊపందుకున్నాక వరుసగా ఎంటర్టైనర్లు చేస్తూ వచ్చిన నాని.. వాటికి భిన్నంగా ‘నిన్ను కోరి’ లాంటి ఇంటెన్స్ లవ్ స్టోరీ చేశాడు. ఇలాంటి సినిమాతో నాని మెప్పించగలడా అన్న సందేహాల్ని పటాపంచలు చేస్తూ మంచి విజయం సాధించింది. నాని సినిమాల్లో మంచి కథ ఉన్నవాటిలో ఇదొకటిగా చెప్పొచ్చు. ఈ కథను కోలీవుడ్ వాళ్లు కూడా మెచ్చారు.

‘నిన్ను కోరి’ త్వరలోనే తమిళంలోకి రీమేక్ కాబోతోంది. తమిళ వెర్షన్లో నటించే హీరో తెలుగువాడు కావడం విశేషం. అతనెవరో కాదు.. సీనియర్ దర్శకుడు కోదండరామిరెడ్డి తనయుడు వైభవ్. తెలుగులో ‘గొడవ’ చిత్రంతో హీరోగా పరిచయమై.. ఆ తర్వాత కోలీవుడ్‌కు వెళ్లిపోయిన వైభవ్ అక్కడ మంచి పేరే సంపాదించాడు.

హీరోగానే కాక.. క్యారెక్టర్‌ రోల్స్‌తో ఆకట్టుకున్నాడు. గత ఏడాది వైభవ్ నటించిన ‘మెయ్యాదమాన్’ అనే సినిమా సూపర్ హిట్టయింది. దీని తర్వాత అతడికి ఆఫర్లు బాగా పెరిగాయి. ఈ కోవలోనే ‘నిన్ను కోరి’ రీమేక్ అతడి తలుపు తట్టింది. కాస్మో కిరణ్ అనే నిర్మాత ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనున్నాడు. దర్శకుడెవరన్నది ఇంకా ఖరారరవ్వలేదు. ఆది పినిశెట్టి తమిళంలోనూ నటిస్తాడా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. నాని లాగే తమిళంలో ఎంటర్టైనర్లకు పేరుబడ్డ హీరో వైభవ్. అలాగే కొన్ని లవ్ స్టోరీలతోనూ మెప్పించాడు. మరి నాని అదరగొట్టిన పాత్రలో వైభవ్ ఎలా చేస్తాడో చూడాలి.

డీవీవీ దానయ్య.. కోన వెంకట్ కలిసి నిర్మించిన ‘నిన్ను కోరి’తో శివ నిర్వాణ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. షార్ట్ ఫిలిం బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన శివ.. తొలి ప్రయత్నంలోనే మెచ్యూర్డ్ లవ్ స్టోరీతో మెప్పించాడు. అతను ప్రస్తుతం నాగచైతన్య-సమంత కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు