సాయిపల్లవిని అన్నాడు.. మరి శౌర్య సంగతేంటి?

సాయిపల్లవిని అన్నాడు.. మరి శౌర్య సంగతేంటి?

ఒక హీరోయిన్ గురించి ఏ హీరో చేయని వ్యాఖ్యలు చేశాడు నాగశౌర్య. సినిమా షూటింగ్ అన్నాక ఏవో చిన్న చిన్న ఇబ్బందులు మామూలే. అలాంటి విషయాల్ని బయటికి చెప్పరు. ఏదైనా ఉంటే ఆ వ్యక్తినే నేరుగా చెప్పి సర్దుబాట్లు చేసుకుంటారు. కానీ శౌర్య మాత్రం సాయిపల్లవి గురించి చాలా తేలిగ్గా మాట్లాడేశాడు. ఆమెకు ఇగో ఎక్కువ అని.. ‘కణం’ సినిమా షూటింగ్ సందర్భంగా చాలా ఇరిటేట్ చేసిందని అన్నాడు.

ఒకసారి తొందరపడి ఏద అనేశాడనుకుంటే.. ఇంకోసారి కూడా ఆ వ్యాఖ్యలు కట్టుబడి ఉన్నట్లుగా చెప్పాడు. తాను శౌర్యను ఇబ్బంది పెట్టి ఉంటే సారీ అని సాయిపల్లవి అన్నా కూడా శౌర్య ఏమీ దానిపై స్పందించలేదు. సాయిపల్లవిని ఉద్దేశించి అలా అన్న శౌర్య.. మీడియాను కలిసినపుడు చేస్తున్న వ్యాఖ్యలు అతడి యాటిట్యూడ్ ఎలాంటిదో కూడా చాటిచెబుతున్నాడు.

తాజాగా మల్టీస్టారర్ల గురించి అడిగితే.. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సినిమాలు చేయను అనేశాడు. సినీ పరిశ్రమకు మల్టీస్టారర్లు అవసరం అని ఎవరైనా అంటారు. దీని వల్ల కొత్త కథలు పుట్టే అవకాశముంటుంది. స్టార్ హీరోలే ఇగోలు పక్కన పెట్టి మల్టీస్టారర్లు చేస్తున్నారు. అలాంటిది శౌర్య మాత్రం మల్టీస్టారర్లు చేయనంటూ తెగేసి చెప్పాడు. అసలు శౌర్య ఏమంత స్టార్ అయిపోయాడని వేరే హీరోలతో కలిసి చేయనంటాడు అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరోవైపు స్టార్ ఇమేజ్ గురించి మాట్లాడుతూ.. రామ్ చరణ్‌తోనే అది ఆగిపోయిందని అన్నాడు.

విజయ్ దేవరకొండ గురించి ప్రస్తావిస్తే ఫ్లాప్ వచ్చినపుడూ ఇలాగే ఉంటుందా అంటూ సెటైరిగ్గా మాట్లాడాడు. ఇందులో లాజిక్ కంటే కూడా అసహనం కనిపిస్తోందంటూ విజయ్ అభిమానులు అతడిని తగులుకున్నారు. మరోవైపు గర్ల్ ఫ్రెండ్స్ విషయంలో శౌర్య చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశమయ్యాయి. మొత్తంగా చూస్తే సాయిపల్లవి యాటిట్యూడ్ గురించి వ్యాఖ్యలు చేసిన శౌర్య.. తన యాటిట్యూడ్ ఎలాంటిది.. తానెలా మాట్లాడుతున్నాడో కూడా ఒకసారి చూసుకుంటే మంచిదన్న కామెంట్లు పడుతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు