బన్నీ ద్విభాషా చిత్రం.. ఉంది కానీ!

బన్నీ ద్విభాషా చిత్రం.. ఉంది కానీ!

అల్లు అర్జున్ కథానాయకుడిగా గత ఏడాది ఒక తెలుగు, తమిళ ద్విభాషా చిత్రాన్ని అనౌన్స్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. తమిళ అగ్ర నిర్మాతల్లో ఒకరైన జ్ఞానవేల్ రాజా నిర్మాణంలో తెరకెక్కే ఈ చిత్రానికి ‘రన్’.. ‘పందెంకోడి’ లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకూ బాగానే పరిచయమున్న తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడని ప్రకటించారు.

అప్పట్లో ఈ సినిమా అనౌన్స్‌మెంటే సినిమా ప్రారంభోత్సవం స్థాయిలో జరిగింది. కానీ ఆ ప్రకటన తర్వాత ఈ సినిమా ఊసే లేకపోయింది. లింగుస్వామి వేరే ప్రాజెక్టుల్లో బిజీ అయిపోయాడు. బన్నీ కూడా అంతే. ‘నా పేరు సూర్య’ పూర్తయ్యాక కూడా బన్నీ దీని ఊసు ఎత్తకపోవడంతో ఇక ఈ ప్రాజెక్టు ఆగిపోయినట్లే అని అంతా అనుకున్నారు.

కానీ తాజా సమాచారం ప్రకారం జ్ఞానవేల్ రాజాతో బన్నీ ద్విభాషా చిత్రం ఉంటుందట. కానీ ఈ చిత్రానికి లింగుస్వామి దర్శకుడు కాదంటున్నారు. ఆయన స్థానంలోకి ‘శౌర్యం’ శివ వచ్చాడని సమాచారం. కెమెరామన్‌గా పేరు తెచ్చుకుని ‘శౌర్యం’తో దర్శకుడిగా మారిన శివ.. ఆపై తెలుగులో ‘శంఖం’, ‘దరువు’ లాంటి ఫ్లాప్ సినిమాలు తీశాడు. తర్వాత తమిళంలోకి వెళ్లి ‘విక్రమార్కుడు’ రీమేక్ ‘సిరుత్తై’తో హిట్టు కొట్టాడు.

ఆపై వరుసగా అజిత్‌తో ‘వీరం’.. ‘వేదాళం’.. ‘వివేగం’ సినిమాలు తీశాడు. ప్రస్తుతం అదే హీరోతో ‘విశ్వాసం’ చేస్తున్నాడు. దీని తర్వాత బన్నీ-జ్ఞానవేల్ రాజా సినిమాను అతను టేకప్ చేస్తాడని అంటున్నారు. మాస్ పల్స్ బాగా తెలిసిన శివకు రెండు భాషల ప్రేక్షకుల అభిరుచిపై అవగాహన ఉందని.. రెండు చోట్లా వర్కవుటయ్యే మాస్ ఎంటర్టైనర్‌తో అతను రాబోతున్నాడని చెబుతున్నారు. త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన వస్తుందట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు