మహేష్ అమ్మానాన్నా వాళ్లిద్దరే..

మహేష్ అమ్మానాన్నా వాళ్లిద్దరే..

హీరోగా మహేష్ బాబు కెరీర్లో అత్యధిక సార్లు కలిసి నటించిన ఆర్టిస్టు ప్రకాష్ రాజే అయ్యుంటాడు. హీరోగా మహేష్ తొలి సినిమా ‘రాజకుమారుడు’లో ప్రకాష్ రాజ్ అతడికి మావయ్యగా నటించాడు. ఆ తర్వాత ‘ఒక్కడు’లో విలన్‌గా కనిపించాడు. ‘దూకుడు’.. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి సినిమాల్లో తండ్రిగా కనిపించాడు. ఇంకా మహేష్ సినిమాల్లో మరెన్నో రకాల పాత్రలు చేశాడీ విలక్షణ నటుడు. ఆయన మరోసారి మహేష్ బాబుకు తండ్రిగా కనిపించబోతున్నాడట. సూపర్ స్టార్ కొత్త సినిమా ‘మహర్షి’లో ప్రకాష్ రాజ్ పాత్ర గురించి వివరాలు బయటికి వచ్చాయి. ఇందులో మహేష్ తండ్రిగా రిచ్ బిజినెస్ మ్యాన్ పాత్రలో కనిపిస్తాడట ప్రకాష్ రాజ్. ఆయనకు భార్యగా, మహేష్‌కు తల్లిగా సహజ నటి జయసుధ నటించనుంది.

ఈ విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో జయసుధే స్వయంగా వెల్లడించారు. వీళ్లిద్దరూ కలిసి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లోనూ మహేష్ బాబుకు తల్లిదండ్రులుగా కనిపించిన సంగతి తెలిసిందే. ఆపై ‘శతమానం భవతి’లోనూ ప్రకాష్-జయసుధ జంటగా కనిపించారు. మరి ఈ జోడీ ‘మహర్షి’లో ఎలాంటి ప్రత్యేకతను చూపిస్తుందో.. మహేష్‌‌తో వాళ్ల సన్నివేశాలు ఎలా ఉంటాయో చూడాలి. అగ్ర నిర్మాతలు దిల్ రాజు, అశ్వినీదత్, పొట్లూరి వరప్రసాద్ కలిసి నిర్మిస్తున్న ‘మహర్షి’కి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నడు. ఈ చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్నందిస్తున్న ఈ చిత్రానికి బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ మోహనన్ ఛాయాగ్రహణం సమకూరుస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుందని భావిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English