మార్మోగుతున్న ‘నాన్నకు ప్రేమతో’

మార్మోగుతున్న ‘నాన్నకు ప్రేమతో’

హరికృష్ణ మరణించిన నేపథ్యంలో ఇటు సోషల్ మీడియాలో.. అటు టీవీ ఛానెళ్లలో ‘నాన్నకు ప్రేమతో’లోని టైటిల్ సాంగ్.. అందులోని కొన్ని డైలాగులు మార్మోగుతున్నాయి. ప్రతి టీవీ ఛానెల్లో బ్యాగ్రౌండ్ ‘నాన్నకు ప్రేమతో’ పాటనే ప్లే చేస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో మైలురాయిగా నిలిచిన ఈ చిత్రం తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలోనే సాగుతుందన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్‌కు కొన్ని రోజుల ముందే దేవిశ్రీ ప్రసాద్ తన తండ్రి సత్యమూర్తిని కోల్పోయాడు. ఈ నేపథ్యంలో ఎంతో ఫీల్‌తో ‘నాన్నకు ప్రేమతో’ పాటను ట్యూన్ చేశాడు. తన తమ్ముడు సాగర్‌తో కలిసి ఆ పాటను చాలా హృద్యంగా ఆలపించాడు. ఆ పాట వింటే వాళ్ల సొంత పాటలాగే ఉంటుంది. అదే సమయంలో సినిమాలో కూడా ఆ సాంగ్ బాగా ఇమిడిపోయింది. దర్శకుడు సుకుమార్‌కు సైతం తన తండ్రి అంటే చాలా ఇష్టం. ఆయన కూడా ఆ పాటను చాలా ఓన్ చేసుకున్నారు. దాని గురించి గొప్పగా చెప్పాడు. ఇక ఎన్టీఆర్ అయితే ఈ చిత్ర ఆడియో వేడుకలో తన తండ్రితో అనుబంధం గురించి చెబుతూ.. నాన్నల పిచ్చోళ్లందరం కలిసి ఈ సినిమా చేశామంటూ ఉద్వేగానికి గురయ్యాడు. దాదాపుగా కళ్లలో నీళ్లు పెట్టుకున్నాడు. సినిమా చివర్లో నాన్న చనిపోయినా ఏడవకుండా ఉండటానికి కారణం చెబుతూ.. నాన్న అనే ఎమోషన్ తనతోనే ఉండాలంటే తాను ఏడవకూడదు అంటూ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్స్ చాలా హృద్యంగా ఉంటాయి. ఇప్పుడు ఈ డైలాగుల్ని టీవీ ఛానెళ్లలో ప్లే చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ ఈ సన్నివేశంతో పాటు నాన్న చనిపోతుంటే ఎన్టీఆర్ ఉద్వేగానికి గురయ్యే సీన్‌కు సంబంధించిన వీడియోలు విస్తృతంగా కనిపిస్తున్నాయి. వీటిని చూసి ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్‌ల పరిస్థితి తలుచుకుని అయ్యో అనుకుంటున్నారు. కొన్నేళ్ల కిందటే సోదరుడు జానకి రామ్‌ను కోల్పోయిన కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్‌లు ఇప్పుడు నాన్నను దూరం చేసుకోవడం అందరినీ కలచివేస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు