హరి మరణంతో అన్నీ బంద్

హరి మరణంతో అన్నీ బంద్

నందమూరి హరికృష్ణ మరణం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదమే నింపింది. ఒక మనిషి గొప్పదనమేంటన్నది ఆ వ్యక్తి అందరికీ దూరమైనపుడే తెలుస్తుందని అంటారు. హరికృష్ణ మరణానంతరం ఆయన గొప్పదనం గురించి ఎన్నో విషయాలు బయటికి వస్తున్నాయి. హరికృష్ణ కడసారి చూపు కోసం వెల్లువెత్తుతున్న అభిమానుల్ని చూస్తే ఆయనకు జనాల్లో ఉన్న ఆదరణ  ఎలాంటిదో అర్థమవుతుంది. హరికృష్ణ అంతిమ సంస్కారాల్ని ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడాన్ని బట్టి ఆయన ప్రాధాన్యం కూడా తెలుస్తుంది. ఇక సోషల్ మీడియాలో అయితే ఈ రోజు ఉదయం నుంచి హరికృష్ణ తప్ప మరో టాపిక్ లేదు. ప్రతి తెలుగువాడూ ఆయన గురించే మాట్లాడుతున్నారు.

హరి మరణంతో తెలుగు సినీ పరిశ్రమ దాదాపుగా స్తంభించిపోయింది. అన్ని షూటింగులూ.. సినీ కార్యక్రమాలూ రద్దయిపోయాయి. హరికృష్ణకు సన్నిహితుడు.. ఆయనతో కలిసి ‘సీతారామరాజు’లో స్క్రీన్ షేర్ చేసుకున్న అక్కినేని నాగార్జున తన పుట్టిన రోజు వేడుకల్ని రద్దు చేసుకున్నారు. ఈ ఉదయమే హరితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన తనతో అన్న చివరి మాటల్ని ప్రస్తావించాడు నాగ్. తన పుట్టిన రోజే హరి మరణించడం ఆయనకు ఎప్పటికీ మరిచిపోలేని చేదు జ్ఞాపకమే. నాగ్ పుట్టిన రోజు కానుకగా విడుదల కావాల్సిన ‘శైలజారెడ్డి అల్లుడు’ ట్రైలర్ ఆగిపోయింది. అలాగే ‘దేవదాస్’ నుంచి రావాల్సిన ఫస్ట్ సింగిల్ లాంచ్ కూడా ఆపారు. విశాల్ సినిమా ‘పందెంకోడి-2’ టీజర్ కూడా రిలీజ్ చేయలేదు. మరోవైపు రేపు, ఎల్లుండి రిలీజ్ కావాల్సిన కొత్త సినిమాల ప్రచారానికి కూడా బ్రేక్ పడింది. సోషల్ మీడియాలో అప్ డేట్స్ ఏమీ లేవు. ఈ సమయంలో ఏ ప్రమోషన్ కూడా సమంజసంగా అనిపించదు. హరికృష్ణ దహన సంస్కారాలు గురువారం జరగబోతుండగా.. అదే రోజు విడుదల కానున్న ‘నర్తనశాల’కు ప్రమోషన్ పరంగా చాలా ఇబ్బందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు