'అరవింద సమేత'లోనే అరంగేట్రం

'అరవింద సమేత'లోనే అరంగేట్రం

ఇంతకుముందు పరభాషా హీరోయిన్లు డబ్బింగ్ జోలికే వెళ్లేవాళ్లు కాదు. డబ్బింగ్ చెప్పడం తర్వాత.. ముందు తెలుగులో నాలుగు ముక్కలు నేర్చుకోవడానికి కూడా ప్రయత్నించేవాళ్లు కాదు. సిమ్రాన్.. త్రిష లాంటి స్టార్ హీరోయిన్లు తెలుగులో మాట్లాడ్డమే చూసి ఉండరు ఎవరూ. కానీ తర్వాతి తరం హీరోయిన్లు అలా కాదు. వీళ్లందరూ ఈజీగా తెలుగు నేర్చుకుంటున్నారు. మన భాషలో డబ్బింగ్ కూడా చెప్పేస్తున్నారు. ఛార్మి.. సమంత.. తమన్నా.. రకుల్ ప్రీత్.. ఇలా చాలామంది తెలుగు నేర్చుకున్నవాళ్లే. డబ్బింగూ దంచేసిన వాళ్లే. వీళ్లందరూ మిగతా హీరోయిన్లు కూడా మన భాష నేర్చుకోక తప్పని పరిస్థితి కల్పిస్తున్నారు. ఈ జాబితాలోకి తాజాగా పూజా హెగ్డే కూడా చేరిపోయింది. ఆమె తన కొత్త సినిమా ‘అరవింద సమేత’కు సొంతంగా డబ్బింగ్ చెప్పుకోబోతుండటం విశేషం.

త్రివిక్రమ్ చివరి సినిమా ‘అజ్ఞాతవాసి’లో కీర్తి సురేష్‌తో పాటు అను ఇమ్మాన్యుయెల్ కూడా తమ పాత్రలకు డబ్బింగ్ చెప్పుకున్నారు. ఈ కోవలోనే పూజాతోనూ డబ్బింగ్ చెప్పించడానికి సిద్ధమైపోయాడు త్రివిక్రమ్. మొన్నటిదాకా ఇంగ్లిష్‌లోనే మాట్లాడుతూ వచ్చిన పూజా.. ఈ మధ్య తెలుగు డెవలప్ చేసింది. కొంచెం కష్టపడుతూనే ఆమె ‘అరవింద సమేత’లో తన పాత్రకు వాయిస్ ఇస్తోంది. డబ్బింగ్ స్టూడియో నుంచి ఆమె ఫొటో దిగి.. తాను ఈ చిత్రంలోనే తొలిసారిగా తెలుగులో డబ్బింగ్ చెప్పుకుంటున్న విషయాన్ని వెల్లడించింది. ఈ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చినట్లు సమాచారం. టాకీ పార్ట్ చివరి దశలో ఉండగానే డబ్బింగ్, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలుపెట్టేశారు. దసరా కానుకగా అక్టోబరు 11న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు