హరికృష్ణ.. ఆ కల తీరకుండానే

హరికృష్ణ.. ఆ కల తీరకుండానే

ఈ రోజు ఉదయం హరికృష్ణ హఠాన్మరణంతో తెలుగు రాష్ట్రాలు తీవ్ర దిగ్భ్రాంతిలో మునిగిపోయాయి. ఇటు సినీ.. అటు రాజకీయ రంగాలపై తనదైన ముద్ర వేశారు హరికృష్ణ. ఆయన చేసిన సినిమాలు చాలా తక్కువే. కానీ వాటిలో గుర్తుండిపోయే పాత్రలు చేశారు. రాజకీయాల్లో బిజీ అయ్యాక సినిమాలకు దూరం అయిపోయిన ఆయన రెండో ఇన్నింగ్స్‌లో ‘శ్రీరాములయ్య’.. ‘సీతారామరాజు’ లాంటి చిత్రాల్లో ప్రత్యేక పాత్రలు పోషించారు. ఐతే కెరీర్లో అంతకుముందు చేసిన సినిమాలన్నీ ఒకెత్తయితే.. ‘లాహిరి లాహిరి లాహిరిలో’.. ‘సీతయ్య’ సినిమాలు మరో ఎత్తు. వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో హరికృష్ణ ప్రధాన పాత్ర పోషించిన ‘లాహిరి లాహిరి లాహిరిలో’ ఏ అంచనాలు లేకుండా విడుదలై ఘనవిజయం సాధించింది.


దీంతో హరికృష్ణను సోలో హీరోగా పెట్టి ‘సీతయ్య’ లాంటి పవర్ ఫుల్ మూవీ తీశాడు చౌదరి. అది కూడా బాగానే ఆడింది. ఈ ఊపులో మరికొన్ని సినిమాలు చేసిన హరికృష్ణ.. ‘శ్రావణమాసం’ తర్వాత మేకప్ వేసుకోలేదు. ఆరోగ్యం దెబ్బ తినడం.. లుక్ తేడా రావడంతో సినిమాలకు దూరమైపోయారు. ఇక మళ్లీ హరికృష్ణ సినిమాల్లోకి రాడనే అంతా అనుకున్నారు కానీ.. తన కొడుకులు జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కళ్యాణ్ రామ్‌లతో కలిసి నటించాలని ఆయన ఆశ పడ్డట్లుగా సన్నిహితులు చెబుతారు. ఈ ముగ్గురూ కలిసి ఒక మల్టీస్టారర్ చేస్తే చూడాలని నందమూరి అభిమానులు కూడా ఆకాంక్షించారు. కళ్యాణ్ రామ్ సైతం ఓ సందర్భంలో దీని గురించి మాట్లాడారు. కథ కోసం చూస్తున్నట్లు చెప్పాడు. అన్నీ కుదిరితే ముగ్గురం కలిసి నటిస్తామన్నాడు. ఆ ప్రయత్నాలు ఎంత వరకు వచ్చాయో కానీ.. హరికృష్ణ ఈ రోజు అనూహ్య రీతిలో తుది శ్వాస విడిచారు. మరి భవిష్యత్తులో ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్ కలిసి నటించి తమ తండ్రికి నివాళి అర్పిస్తారేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు