అవసరాల హీరో మారాడా?

అవసరాల హీరో మారాడా?

నటుడిగా తొలి సినిమా ‘అష్టాచెమ్మా’తోనే తనేంటో రుజువు చేశాడు అవసరాల శ్రీనివాస్. ఆ తర్వాత మరెన్నో మంచి పాత్రలు పోషించిన అవసరాల.. ‘ఊహలు గుసగుసలాడే’తో రచయితగా, దర్శకుడిగానూ తన ప్రతిభను చూపించాడు. పెద్దగా అంచనాల్లేకుండా వచ్చిన ఆ చిత్రం మంచి విజయం సాధించడమే కాదు.. ఒక మోడర్న్ క్లాసిక్‌ లాగా నిలిచిపోయింది.

అవసరాల రెండో సినిమా ‘జ్యో అచ్యుతానంద’ కూడా మంచి సినిమాగా గుర్తింపు పొందింది. కమర్షియల్‌గానూ సక్సెస్ అయింది. దీంతో అవసరాల నుంచి వచ్చే తర్వాతి సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐతే ‘ఊహలు గుసగుసలాడే’ తర్వాత ఎలాగైతే చాలా గ్యాప్ తీసుకున్నాడో.. ‘జ్యో అచ్యుతానంద’ తర్వాత కూడా అలాగే చేస్తున్నాడు అవసరాల. ఇప్పటిదాకా అతడి కొత్త సినిమా మొదలు కాలేదు.

అసలు అవసరాల తర్వాతి సినిమా ఎవరితో అన్నది కూడా ఖరారవ్వలేదు. ముందు అనుకున్న ప్రకారమైతే అవసరాల.. నానితో సినిమా చేయాల్సింది. కానీ నాని కోసం ముందు అనుకున్న కథ వర్కవుట్ కాలేదు. నాని కూడా వేరే సినిమాలతో బిజీ అయిపోయాడు. మధ్యలో వేరే హీరోతో ఒక సినిమా చేసి.. ఆపై నేచురల్ స్టార్‌తో సినిమా తీయాలని అవసరాల అనుకున్నాడు. సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్‌ హీరోగా పరిచయమయ్యే సినిమాకు అవసరాలే దర్శకుడని ప్రచారం జరిగింది. వీరి మధ్య కథా చర్చలు కూడా జరిగాయన్నారు.

కానీ ఇప్పుడేమో అవసరాల తర్వాతి సినిమా హీరోగా మరో పేరు తెరమీదికి వచ్చింది. యువ కథానాయకుడు నిఖిల్‌తో అతను సినిమా చేయబోతున్నాడట. వీరిద్దరూ ఒక కథపై అంగీకారానికి వచ్చారట. అవసరాల తొలి రెండు సినిమాల్ని ప్రొడ్యూస్ చేసిన సాయి కొర్రపాటే ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తాడట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు