మల్టీస్టారర్లు చేయనంటే చేయననేశాడు

మల్టీస్టారర్లు చేయనంటే చేయననేశాడు

ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తే అది మల్టీస్టారర్ అవుతుంది. కానీ చిన్న స్థాయి హీరోలు కలిసి నటించినా దాన్ని మల్టీస్టారర్ అనే అనేస్తున్నారు. ఆ సంగతలా వదిలేస్తే.. మల్టీస్టారర్లకు మీరు సిద్ధమా అంటూ ఏ కథానాయకుడిని మరో మాట లేకుండా ఔనని అంటారు. మంచి కథ కుదిరితే ఎవరితోనైనా నటించడానికి రెడీ అని జవాబిస్తుంటారు. ఇందులో చిన్న హీరో పెద్ద హీరో అని తేడాలేమీ ఉండవు.

కానీ ఇంకా స్టార్ ఇమేజ్ ఏమీ సంపాదించని నాగశౌర్య మాత్రం తాను మల్టీస్టారర్లు చేయనంటే చేయను అంటున్నాడు. ఇంతకుముందు నాగశౌర్య.. నారా రోహిత్‌తో కలిసి రెండు సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. అందులో ‘జ్యో అచ్యుతానంద’ మంచి విజయం సాధించింది కూడా. అయినప్పటికీ తనకు మల్టీస్టారర్లు ఇష్టం లేదని అంటున్నాడతను.

రోహిత్ తో తనకున్న అండర్ స్టాండింగ్ మేరకు తాను ఇంతకుముందు అతడితో కలిసి సినిమాలు చేశానని.. కానీ ఇకపై మాత్రం మరో హీరోతో కలిసి సినిమా చేసే ఉద్దేశాలేమీ లేవని అతను స్పష్టం చేశాడు. ఐతే పెద్ద పెద్ద హీరోలే ఇంతకుముందులా ఇమేజ్ అంటూ హద్దులు గీసుకోకుండా.. ఇగోలు పక్కన పెట్టి.. మల్టీస్టారర్ మూవీస్ చేస్తుంటే.. నాగశౌర్య మాత్రం తాను ఈ తరహా సినిమాలు చేయనని స్పష్టం చేయడం విడ్డూరమే.

ఇక శౌర్య కొత్త సినిమాల విషయానికి వస్తే.. త్వరలోనే తాను రమణ అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా చేయబోతున్నట్లు చెప్పాడు. ఇది కాక మరో రెండు సినిమాలు మొదలుపెడతానన్నాడు. శౌర్య కొత్త సినిమా ‘@ నర్తనశాల’ గురువారమే ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ‘ఛలో’ తర్వాత శౌర్య సొంత బేనర్లో నటించిన కొత్త చిత్రమిది. శ్రీనివాస్ చక్రవర్తి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English