పోరాటం ఆపని ఫ్లాప్ డైరెక్టర్

పోరాటం ఆపని ఫ్లాప్ డైరెక్టర్

రమేష్ వర్మ గుర్తున్నాడా..? తరుణ్ హీరోగా ‘ఒక ఊరిలో’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడతను. మంచి విజయం సాధించేలా కనిపించిన ఈ చిత్రం ఫ్లాప్ అయినా.. ఆ తర్వాత ఓ కొరియన్ సినిమాను కాపీ కొట్టి తీసిన ‘రైడ్’ సినిమాతో ఓ మోస్తరు విజయాన్నందుకున్నాడతను. కానీ ఆ విజయాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. వరుసగా ‘వీర’.. ‘అబ్బాయితో అమ్మాయి’ లాంటి ఫ్లాప్ మూవీస్ తీశాడు. ఈ దెబ్బతో రమేష్ పనైపోయినట్లే అనుకున్నారు కానీ.. అతను మళ్లీ ఇప్పుడు ఓ సినిమాను అనౌన్స్ చేశాడు. ఈ చిత్రానికి కథ అందించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు రమేష్ వర్మ.

ఈ సినిమా పేరు.. 7. ఇదొక థ్రిల్లర్ మూవీ అట. ఈ చిత్రంతో నిజార్ షఫి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. నిజార్ సినిమాటోగ్రాఫర్‌గా బాగానే పాపులర్. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘భలే భలే మగాడివోయ్’.. ‘మహానుభావుడు’తో పాటు నాని చిత్రం ‘నేను లోకల్’కు కూడా ఛాయాగ్రహణం అందించాడు నిజార్. తన దర్శకత్వ కలల గురించి గతంలోనే అతను ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఇప్పుడు ఆశ్చర్యకరంగా రమేష్ వర్మ స్క్రిప్టుతో అతను సినిమా తీస్తున్నాడు. దర్శకుడిగా విఫలమైనా.. పబ్లిసిటీ డిజైనర్‌గా రమేష్‌కు మంచి పేరే ఉంది.  అతడి సినిమాల ప్రోమోలు చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. ‘7’ పోస్టర్ సైతం ఆసక్తి రేకెత్తిస్తోంది. కెరీర్లో తొలిసారిగా థ్రిల్లర్ మూవీ ట్రై చేస్తున్న రమేష్ ఎలాంటి ఫలితాన్నందుకుంటాడో చూడాలి. ఈ చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు