'గీత గోవిందం' కాపీ అన్న ఆ లెజెండ్

'గీత గోవిందం' కాపీ అన్న ఆ లెజెండ్

'గీత గోవిందం' తన సినిమాను కాపీ కొట్టి తీసిందని అంటున్నాడు ఒక లెజెండరీ డైరెక్టర్. ఆ దర్శకుడెవరో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఆయన మరెవరో కాదు.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. తన సినిమాల గురించే పెద్దగా మాట్లాడని దర్శకేంద్రుడు.. వేరే చిత్రాల గురించి వ్యాఖ్యానించడం అరుదే. అలాంటిది ‘గీత గోవిందం’ను కాపీ సినిమా అన్నాడంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఐతే ఇది ఆయన సీరియస్‌గా అన్న మాట కాదు. సరదాకే అన్నారు. ‘గీత గోవిందం’ను తన బ్లాక్ బస్టర్ మూవీ ‘పెళ్ళిసందడి’తో పోల్చాడు రాఘవేంద్రరావు. దాన్ని కాపీ కట్టి అల్లు అరవింద్ టీం ‘గీత గోవిందం’ తీసిందని.. చాలా రకాలుగా ఆ చిత్రంతో దీనికి పోలికలు ఉన్నాయని ఆయనన్నారు. అప్పట్లో ‘పెళ్ళిసందడి’ చిన్న స్థాయిలో తెరకెక్కి పెద్ద విజయం సాధించిందన్నారు.


''20 సంవత్సరాల క్రితం అర‌వింద్.. నేను క‌ల‌సి ‘పెళ్లి సంద‌డి’ సినిమా తీశాం. మ‌ళ్లీ ఇన్నేళ్లకి ‘గీత‌ గోవిందం’ చిత్రం మా చిత్రాన్ని గుర్తు చేసింది. పరశురాం నా ‘పెళ్లి సంద‌డి’ సినిమాని కాపీకొట్టాడు. ఆ సంగతలా వదిలేస్తే ఓ సినిమా తీస్తున్నపుడు దర్శకుడికి నిర్మాత‌ల ద‌గ్గ‌ర నుంచి ఎంతో ఒత్తిడి ఉంటుంది. అవన్నీ పరశురాంకి కూడా ఎదురయ్యే ఉంటాయి. ఈ రోజుల్లో ముద్దు సీన్లు లేకుండా సినిమా తీయడం కష్టమైపోతోంది. అయినా కూడా పరశురామ్ ఏమాత్రం రాజీ పడకుండా తాను ఏం తీయాలనుకుంటే అది తీశాడు. ఇలాంటి ఒక మంచి చిత్రాన్ని అందించాడు. ఈ విషయంలో చాలా సంతోషంగా ఉంది'' అని రాఘవేంద్రరావు అన్నారు. పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన ‘గీత గోవిందం’ ఇప్పటికే రూ.50 కోట్ల దాకా షేర్ రాబట్టింది. గ్రాస్ వంద కోట్లు దాటింది. ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.60 కోట్ల షేర్ మార్కునూ అందుకుంటుందని అంచనా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు