మోసం చేసి అవార్డిచ్చార‌న్న చిరు

మోసం చేసి అవార్డిచ్చార‌న్న చిరు

ఎవ‌రైనా పిలిచి అవార్డిస్తానంటే సంతోషించ‌కుండా ఎలా ఉంటారు? ఐతే మెగాస్టార్ చిరంజీవి మాత్రం త‌న‌కు అవార్డిస్తానంటే ఒక వేడుక‌కే రాన‌న్నార‌ట‌. ఆ ష‌ర‌తు మేర‌కే సంతోషం అవార్డుల వేడుక‌కు తాను హాజ‌ర‌య్యాన‌ని.. కానీ త‌న‌ను మోసం చేసి అవార్డు ఇచ్చేశార‌ని చిరు చ‌మ‌త్క‌రించాడు. ఈ వేడుక‌లో దిగ్గ‌జ గాయ‌ని ఎస్.జాన‌కి చేతుల మీదుగా ప్ర‌త్యేక పుర‌స్కారం అందుకున్న అనంత‌రం చిరు ఆస‌క్తిక‌ర ప్ర‌సంగం చేశాడు. ఆయ‌నేమ‌న్నారంటే..

‘‘నాకు అవార్డు ఇస్తానంటే వేడుక‌కు రాను.. ఇవ్వ‌నంటేనే వ‌స్తాన‌ని సురేష్‌ కొండేటికి ముందే చెప్పా. కానీ న‌న్ను మోసం చేసి ఎస్. జాన‌కి గారి చేతుల మీదుగా అవార్డు బ‌హుక‌రించి న‌న్ను లాక్ చేసేశారు. ఆమె చేతుల మీదుగా కాబ‌ట్టి కాద‌న‌లేక ఈ అవార్డు తీసుకుంటున్నా. చాలా సంతోషం. ఇప్ప‌టి వ‌ర‌కూ ఆమె చేతుల మీదుగా ఎప్పుడూ అవార్డు తీసుకోలేదు. మ‌రొకరి చేతుల మీదుగా ఇచ్చుంటే తిర‌స్క‌రించేవాడిని. ఇలాంటి అవార్డులు కొత్త వాళ్ల‌కు ఇచ్చి ప్రోత్స‌హిస్తే బాగుంటుంది. వాళ్ల‌లో ఉత్సాహం నింపిన‌ట్లుంటుంది. వాళ్ల‌ను చూసి మ‌రెంతో మంది స్ఫూర్తి పొందుతారు. అందుకే నాకు అవార్డు వ‌ద్ద‌న్నాను.

ఇక ఈ వేడుక‌లో శ్రీదేవి పేరు మీద అవార్డు నెల‌కొల్ప‌డం మంచి విష‌యం. నేను చాలా మంది హీరోయిన్ల‌తో క‌లిసి న‌టించాను. కానీ శ్రీదేవితో న‌టించిన ఆ నాలుగు సినిమాల అనుభ‌వాన్ని ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేను. అందులోనూ ‘జ‌గదేక వీరుడు.. అతిలోక సుంద‌రి’ ఓ మ‌ధుర జ్ఞాప‌కం. శ్రీదేవి కెరీర్ ఆరంభంలో ఎలా ఉందో చివ‌రి వ‌ర‌కూ అలాగే ఉంది. స్టార్ స్టేట‌స్ వ‌చ్చాక కొంద‌రిలో మార్పులొస్తాయి. కానీ శ్రీదేవిలో ఎలాంటి మార్పులు రాలేదు. ఆమెను చూసి నేను కొన్ని విష‌యాలు తెలుసుకున్నాను. నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్లు ఎంతమంది ఉన్నా ఆల్ ఇండియా లేడీ సూప‌ర్ స్టార్ అనిపించుకుంది శ్రీదేవి మాత్ర‌మే. ఆమె అవార్డును త‌మ‌న్నా అందుకోవ‌డం సంతోషంగా ఉంది’’ అని చిరు అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు