వావ్.. కడపలో భారతీయుడు-2

వావ్.. కడపలో భారతీయుడు-2

ఎట్టకేలకు ఇటీవలే శంకర్-రజనీకాంత్‌ల మాగ్నమ్ ఓపస్ ‘2.0’ రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ చిత్రాన్ని నవంబరు 29న విడుదల చేయబోతున్నట్లు శంకర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. విజువల్ ఎఫెక్ట్స్ సహా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ దాదాపుగా పూర్తి కావచ్చిందని.. త్వరలోనే ప్రమోషన్ కూడా మొదలుపెడతారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

వినాయక చవితి కానుకగా టీజర్ లాంచ్ చేస్తారని కూడా అంటున్నారు. ‘2.0’ సంగతి తేలిపోవడంతో ఇక తన తర్వాతి సినిమా ‘భారతీయుడు-2’ పని మొదలుపెట్టడానికి శంకర్ సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా ఎంచుకున్న రవివర్మన్‌తో కలిసి శంకర్ ప్రస్తుతం లొకేషన్ల వేటలో ఉండటం విశేషం. ఇద్దరూ కలిసి హెలికాఫ్టర్లో లొకేషన్లు చూస్తున్న ఫొటో ఒకటి తాజాగా సోషల్ మీడియాలోకి వచ్చింది.

శంకర్ తిరుగుతున్నది ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో కావడం విశేషం. ఆయన కడప జిల్లాలో లొకేషన్లను పరిశీలిస్తున్నారట. ‘భారతీయుడు’లో మాదిరే ఇక్కడ కూడా హీరో ఒక పల్లెటూరి వాడిగానే కనిపించనున్నాడు. దానికి సంబంధించిన ఎపిసోడ్ చిత్రీకరణకు ఆంధ్రాలోని వివిధ ప్రాంతాల్ని పరిశీలిస్తున్నాడు శంకర్. ఆయనకు కడప ప్రాంతం నచ్చిందని.. ఇక్కడే ఒక పల్లెటూరి సెట్ వేసి కీలక సన్నివేశాలు తీయబోతున్నాడని తమిళ మీడియా వర్గాలు చెబుతుండటం విశేషం.

శంకర్ సినిమాలకు తెలుగులోనూ పెద్ద మార్కెట్ ఉంది కాబట్టి ఇక్కడ సన్నివేశాలు తీస్తే తెలుగు ప్రేక్షకులు మరింతగా ‘భారతీయుడు-2’ను ఓన్ చేసుకునే అవకాశముంటుంది. ఈ సంగతలా ఉంచితే.. ‘భారతీయుడు-2’ చిత్రాన్ని శంకర్ కమల్ హాసన్‌తోనే తీస్తాడా లేదా వేరే హీరోన ఎంచుకుంటాడా అనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ చిత్రంలో అజయ్ దేవగణ్ కీలక పాత్ర పోషిస్తాడన్న సమాచారం గురించి ఇటీవల కమల్‌ను ప్రశ్నిస్తే.. తనకు దాని గురించి ఏమీ తెలియదనడం ఈ సినిమాలో ఆయన నటిస్తాడా లేదా అన్న సందేహం రేకెత్తించింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు