రజనీ మిత్రుడు.. స్టాలిన్ సీఎం కావాలంటున్నాడు

రజనీ మిత్రుడు.. స్టాలిన్ సీఎం కావాలంటున్నాడు

విలక్షణ నటుడు మోహన్ బాబుకు రాజకీయాల మీద కూడా బాగానే ఆసక్తి ఉంది. ఎన్టీఆర్ హయాంలో ఎంపీగా కూడా ఉన్న ఆయన.. కొన్నేళ్ల పాటు క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. తర్వాత రాజకీయాలకు దూరమైపోయారు. సమకాలీన రాజకీయాలపై ఒకప్పుడు ఆయన అప్పుడప్పడూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. తాజాగా తమిళనాడు రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరుణానిధి తనయుడు.. మాజీ మంత్రి స్టాలిన్‌ను తమిళనాడు ముఖ్యమంత్రిగా చూడాలని మోహన్ బాబు ఆకాంక్షించడం విశేషం.

ఆదివారం కోయింబత్తూరులో స్టాలిన్‌ తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి సంస్మరణ సభ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి మోహన్‌బాబును కూడా స్టాలిన్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా స్టాలిన్‌తో ఉన్న పొటోను మోహన్‌బాబు ట్విటర్‌లో పంచుకున్నారు. ఈ సభకు తనను ఆహ్వానించినందుకు స్టాలిన్‌కు ధన్యవాదాలు చెప్పిన మోహన్ బాబు.. అతడికి అంతా మంచే జరగాలని.. సీఎంగా చూడాలనుకుంటున్నానని ఆకాంక్షించారు.

ఐతే మోహన్ బాబు తన ఆప్తమిత్రుడిగా చెప్పుకునే రజనీకాంత్ రాజకీయాల్లోకి రాబోతుండగా.. సూపర్ స్టార్‌ను కాదని స్టాలిన్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించడం చిత్రమే. ఇప్పటిదాకా రజనీ రాజకీయ అరంగేట్రం గురించి కానీ.. ఆయన అవకాశాల గురించి కానీ మోహన్ బాబు స్పందించింది లేదు. సందర్భాన్ని బట్టి స్టాలిన్‌ను ప్రశంసించవచ్చు కానీ.. అతనే సీఎం కావాలని మోహన్ బాబు కోరుకోవడం మాత్రం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. రజనీతో ఇంతకుముందులా మోహన్ బాబు సాన్నిహిత్యం చూపించకపోవడంతో తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English