సోలో హీరోగా ఆశలు వదులుకోవాల్సిందే

సోలో హీరోగా ఆశలు వదులుకోవాల్సిందే

ఆది పినిశెట్టి ముందు నటుడిగా పేరు తెచ్చుకున్నది.. హీరోగా నిలదొక్కుకున్నది తమిళంలోనే. కానీ అతను నటుడిగా పరిచయం అయింది మాత్రం తెలుగులోనే. దాసరి నారాయణరావు లాంటి దిగ్దర్శకుడి నిర్మాణంలో తేజ లాంటి స్టార్ డైరెక్టర్ అతడిని ‘ఒక విచిత్రం’ సినిమాతో హీరోగా పరిచయం చేశాడు. కానీ ఆ చిత్రం అతడికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఆ తర్వాత తమిళంలో ‘మృగం’ అనే సినిమా చేసి నటుడిగా గొప్ప పేరు సంపాదించిన ఆది.. ఆపై అక్కడే మంచి విజయాలందుకుని హీరోగా కుదురుకున్నాడు. తిరిగి తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చి హీరోగా ‘గుండెల్లో గోదారి’ చేశాడు కానీ.. అది మంచి ఫలితాన్నివ్వలేదు. ఐతే ‘నిన్ను కోరి’.. ‘రంగస్థలం’ లాంటి చిత్రాల్లో ప్రత్యేక పాత్రలు మాత్రం అతడికి మంచి గుర్తింపునిచ్చాయి. విజయాల్నీ అందించాయి.

ఐతే ఇలాంటి పాత్రలు ఎన్ని చేసినా.. ఎన్ని విజయాలందుకున్నా సోలో హీరోగా సక్సెస్ సాధించాలనే ఉంటుంది ఎవరికైనా. ఆది కూడా అందుకు మినహాయింపు కాదు. ‘నిన్ను కోరి’ చేసిన బేనర్లోనే అతను ‘నీవెవరో’ అనే థ్రిల్లర్ మూవీ చేశాడు. ఈ చిత్రం మంచి ప్రోమోలతో ఆకట్టుకుంది. పైగా తమిళంలో విజయవంతమైన ‘అదే కంగల్’కు రీమేక్ కావడంతో ఇది కచ్చితంగా ఆడుతుందని.. సోలో హీరోగా తెలుగులో తొలి సక్సెస్ అందిస్తుందని ఎంతో ఆశపడ్డాడు ఆది. కానీ అతడి ఆశ నెరవేరలేదు. కోన వెంకట్ లాంటి అనుభవజ్ఞుడి అండ ఉన్నా.. అదేమీ ‘నీవెవరో’కు కలిసి రాలేదు. ఈ చిత్రానికి మినిమం ఓపెనింగ్స్ లేకపోయాయి. టాక్ కూడా బ్యాడ్‌గా ఉండటంతో సినిమా ఫలితమేంటో తొలి రోజే తేలిపోయింది. హీరోగా ఆది ఖాతాలో మరో ఫ్లాప్ జమ అయింది. ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లు సోలో హీరోగా ఆదితో మరో సినిమా చేయాలంటే ఆలోచించే పరిస్థితిని తెచ్చిపెట్టాయి. ఇకపై ఆది ఇలాంటి ప్రయత్నం ఇంకోటి చేస్తాడా అన్నది డౌటే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు