రూ.3 కోట్ల మైన‌స్ పోయి 13 సినిమాలు చేస్తున్నాడ‌ట‌!

రూ.3 కోట్ల మైన‌స్ పోయి 13 సినిమాలు చేస్తున్నాడ‌ట‌!

హీరో అంటే హీరోనే. హీరోగా ఒక‌సారి వెండితెర మీద వెలిగితే.. పోయే వ‌ర‌కూ హీరోగా ఉండాల‌న్న రూల్ టాలీవుడ్‌లో ఎక్కువ మందిలో క‌నిపిస్తుంటుంది. కానీ.. అందుకు భిన్నంగా హీరో కాస్తా విల‌న్ కావ‌టం చాలా అరుదు. అలాంటి అరుదే జ‌గ‌ప‌తిబాబును స్పెష‌ల్ గా మార్చేసింది.

ఒక‌ప్పుడు హీరోగా.. ఫ్యామిలీ హీరోగా క‌నెక్ట్ అయి.. ఇప్పుడు ప‌క్కా డేంజ‌ర్ గాడిగా.. దారుణ‌మైన విల‌నిజాన్ని పండిస్తున్న జ‌గ‌ప‌తిబాబు సెకండ్ ఇన్నింగ్స్ సినిమాటిక్ గా ఉంటుంది. చేతిలో చిల్లిగ‌వ్వ లేక‌పోవ‌టం త‌ర్వాత‌.. ఉన్న ఆస్తుల‌న్ని పోయి.. రూ.3కోట్లు మైన‌స్ లో ప‌డిన వ్య‌క్తి.. రూటు మార్చి వెండితెర మీద విల‌నిజం పండిస్తూ.. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా క‌నెక్ట్ అయిన త‌ర్వాత మైన‌స్ కాస్తా ప్ల‌స్ కావ‌ట‌మే కాదు.. ఇప్పుడు ఏకంగా 13 సినిమాలు ఆయ‌న చేతిలో ఉండ‌టం చూస్తే..రీల్ క‌థ‌కు మించిన ఎగ్జైట్ మెంట్ ఆయ‌న రియ‌ల్ లైఫ్ లో క‌నిపిస్తుంది.

తాజాగా ఇచ్చిన ఒక ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర అంశాల్ని వెల్ల‌డించారు. ఒక‌ప్పుడు తానున్న ప‌రిస్థితుల్లో సినిమా గురించి ఫోన్ వ‌స్తే అద్భుత‌మే అనుకున్నాన‌ని.. కుటుంబాన్ని పోషించ‌టానికి టీవీ సీరియ‌ల్స్ చేద్దామ‌ని అనుకున్న రోజులు కూడా ఉన్నాయ‌ని ఓపెన్ అయ్యారు జ‌గ‌ప‌తిబాబు. అలాంటి తానిప్పుడు బాలీవుడ్ మూవీలో చేస్తున్న‌ట్లు చెప్పారు.

గ‌తంలో మాదిరి ఇప్పుడు కూడా ఖ‌ర్చు చేస్తున్నాన‌ని..  కాకుంటే కాస్త చూసుకుంటున్న‌ట్లు చెప్పిన ఆయ‌న‌.. ఎవ‌రికైనా ఇవ్వ‌టంలో సంతోషం వేర‌న్నారు. తాను ఆర్థిక‌క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు ఆదుకోవ‌టానికి ఎవ‌రూ ముందుకు రాలేద‌న్నారు. అయిన‌ప్ప‌టికీ తానేం బాధ ప‌డ‌టం లేద‌ని.. అయినా.. ఎవ‌రో ఎందుకు ఇవ్వాల‌ని ఎక్ పెక్ట్ చేయాల‌న్నారు.

తాను సినిమాల్లోకి వ‌స్తానంటే త‌న తండ్రి..తల్లితో స‌హా ఎవ‌రికి ఇష్టం లేకున్నా.. త‌న అన్న రామ్ ప్ర‌సాద్ త‌న‌ను ప్రోత్స‌హించార‌ని.. ఆయ‌నే త‌న‌కు స‌ల‌హాలు ఇచ్చేవార‌న్నారు. నాగార్జున కూడా ఏదైనా స‌ల‌హా కావాలంటే త‌న‌కు ఫోన్ చేస్తుంటాడ‌ని.. అంద‌రితో చాలా మంచిగా ఉంటార‌ని చెప్పారు.

అప్పులు పోయి.. ఆస్తులు వ‌చ్చి.. కొంత ప్ల‌స్ లోకి వ‌చ్చానంటే అదంతా టైం మ‌హిమే త‌ప్ప మ‌రొక‌టి లేద‌న్నారు. గ‌తంలో పార్టీలు.. మందు తాగేవాడిన‌ని ఇప్పుడవ‌న్ని బంద్ చేశాన‌న్నారు. త‌న జాత‌కం ప్ర‌కారం 2018 విల్ బీ ద పీక్ అని చెప్పార‌ని.. త‌మిళ‌నాడు తాళ‌ప‌త్ర గ్రంథాలు చూసి చెప్పింది ఇదేన‌ని.. అదే నిజ‌మైంద‌న్నారు.

తెల్ల‌జుట్టు.. నెరిసిన గెడ్డంతో స‌రికొత్త గ్లామ‌ర్ వెనుక స్పెష‌ల్ ట్రిక్కేం లేద‌ని..కేవ‌లం ఒళ్లు వంగ‌క గెడ్డం గీయ‌లేదంతేన‌ని.. ఇంట్లో కూర్చొని ఏం చేయాల‌ని అనుకున్న‌ప్పుడు గ‌డ్డం పెరిగింద‌ని.. ప‌ట్టించుకోలేద‌ని.. త‌ర్వాత అలా తీసిన ఫోటోలే బోయ‌పాటి శ్రీ‌ను చేత లెజెండ్‌లో అవ‌కాశాన్ని ఇచ్చేలా చేశాయ‌న్నారు. అదే స‌మ‌యంలో గెడ్డం ప్ర‌పంచ వ్యాప్తంగా ఫ్యాష‌న్ కావ‌టం అలా కలిసి వ‌చ్చింద‌న్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు