అక్క‌డ బ‌ద్వేలులో.. ఇక్క‌డ హుజూరాబాద్‌లో.. సెప్టెంబ‌ర్‌లో ఎన్నిక‌లు!

తెలంగాణ రాజ‌కీయ మంట రేపిన హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎప్పుడు జ‌రుగుతుంద‌నే విష‌యంపై అటు పార్టీల‌తో పాటు ఇటు ప్ర‌జ‌లు తీవ్ర‌మైన ఆస‌క్తితో ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీని వీడి త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి ఈట‌ల రాజేంద‌ర్ రాజీనామా చేయ‌డంతో హుజూరాబాద్ శాస‌న‌స‌భ స్థానం ఖాళీ అయిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఇక్క‌డ నిర్వ‌హించే ఉప ఎన్నిక‌లో విజ‌యం సాధించాల‌ని ప్ర‌ధానంగా అధికార టీఆర్ఎస్ పార్టీ బీజేపీ త‌ర‌పున ఈట‌ల రాజేంద‌ర్ శాయాశ‌క్తులా ప్ర‌య‌త్నిస్తున్నారు.

దీంతో ఈ ఉప ఎన్నిక ఎప్పుడు జ‌రుగుతుంది? ఆ ఫ‌లితాలు ఎవ‌రికి అనుకూలంగా వ‌స్తాయి? కేసీఆర్ వ్యూహం ఫ‌లిస్తుందా? ఈట‌ల రాజేంద‌ర్ పంతం నెగ్గుతుందా? లాంటి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు తెలుసుకోవాల‌నే ఆస‌క్తి ప్ర‌జ‌ల్లో నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో సెప్టెంబ‌ర్‌లో ఈ ఉప ఎన్నిక జ‌రిగే అవ‌కాశ‌ముంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఆగ‌స్టులోనే హుజూరాబాద్ ఉప ఎన్నిక నోటిషికేష‌న్ వ‌స్తుంద‌ని అంతా అనుకున్నారు. ఆ దిశ‌గానే ముందునుంచే ప్ర‌ధాన పార్టీల నేత‌లంతా అక్క‌డే మ‌కాం వేసి ప్ర‌చారానికి తెర‌లేపారు. కానీ కేంద్ర ఎన్నిక‌ల సంఘం నుంచి ఈ విష‌యంపై స్ప‌ష్ట‌త రాలేదు. ఆగ‌స్టు 28న ఈ ఎన్నిక నిర్వ‌హ‌ణ‌పై కేంద్ర ఎన్నిక‌ల సంఘం అభిప్రాయాలు సేక‌రించింది. దీంతో సెప్టెంబ‌ర్‌లోనే ఎన్నిక‌ల జ‌రిగే ఆస్కార‌ముంద‌నే ప్ర‌చారం జోరంద‌కుంది. ఇప్ప‌టికే ఈ ఎన్నిక‌ను నిర్వ‌హించాల‌ని పార్టీలు కోరుతున్నాయి. ఇక ఇప్పుడేమో సెప్టెంబ‌ర్‌లో ఎన్నిక జ‌రిగే అవ‌కాశం ఉంద‌నే ఊహాగానాల నేప‌థ్యంలో పార్టీలు ఆ దిశ‌గా స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాయి.

టీఆర్ఎస్ త‌మ పార్టీ శ్రేణుల‌ను స‌మాయ‌త్తం చేస్తోంది. ఈ ఎన్నిక‌లో పార్టీని గెలిపించే బాధ్య‌త‌ను భుజాల‌కెత్తుకున్న మంత్రి హ‌రీశ్ రావు వ్యూహాల‌ను రచిస్తున్నారు. అందులో భాగంగానే ఈట‌ల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. మ‌రోవైపు ఈట‌ల కూడా దీటుగానే స్పందిస్తున్నారు. ఈ ఎన్నిక‌లో త‌న‌పై కేసీఆర్ కానీ హ‌రీశ్ కానీ పోటీ చేయాల‌ని ఈట‌ల స‌వాలు విసిరారు.

హుజూరాబాద్ ఉప ఎన్నిక సెప్టెంబ‌ర్‌లోనే జ‌రుగుతుంద‌నే ఊహాగానాల వెన‌క మ‌రో ప్ర‌ధాన కార‌ణం ఉంది. ఏపీలోని క‌డ‌ప జిల్లా బ‌ద్వేలు నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే వెంక‌ట‌సుబ్బ‌య్య ఈ ఏడాది మార్చి 28న చ‌నిపోయారు. దీంతో ఈ శాస‌న‌స‌భ స్థానం ఖాళీ అయి సెప్టెంబ‌ర్ 28 నాటికి ఆరు నెల‌లు పూర్త‌వుతాయి. నిబంధ‌న‌ల ప్ర‌కారం ఓ శాస‌న‌స‌భ్యుడు మ‌ర‌ణించినా లేదా రాజీనామా చేసినా ఆరు నెలల్లో అక్క‌డ ఉప ఎన్నిక నిర్వ‌హించాలి. అయితే క‌రోనా కార‌ణంగా ఈ ఉప ఎన్నిక నిర్వ‌హ‌ణ‌ను ఎన్నిక‌ల సంఘం వాయిదా వేస్తూ వ‌చ్చింది. కానీ ఇప్పుడు సెప్టెంబ‌ర్ 28లోపే పూర్తి చేయాల్సి ఉంది కాబ‌ట్టి త‌ప్ప‌నిస‌రిగా అక్క‌డ ఉప ఎన్నిక నిర్వ‌హించాల్సిందే. ఈ నేప‌థ్యంలో బ‌ద్వేల్తో పాటే హుజూరాబాద్‌కూ ఉప ఎన్నిక నిర్వహిస్తార‌ని తెలుస్తోంది. ఆ మేర‌కు రాజ‌కీయ పార్ట‌లు లెక్క‌లేసుకుంటున్నాయి.