‘కంచరపాలెం’ బూతులపై రానా వివరణ

‘కంచరపాలెం’ బూతులపై రానా వివరణ

కేరాఫ్ కంచరపాలెం.. ప్రస్తుతం టాలీవుడ్లో చర్చనీయాంశం అవుతున్న చిన్న సినిమా. సెప్టెంబరు 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఐతే ఈ చిత్రాన్ని ముందే టాలీవుడ్ సెలబ్రెటీలకు ప్రత్యేక ప్రివ్యూలు వేసి చూపిస్తున్నారు. అందరూ దీని గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. ‘పెళ్ళిచూపులు’ తరహాలోనే ఇది కూడా ట్రెండ్ సెట్టర్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ‘కేరాఫ్ కంచరపాలెం’ ట్రైలర్ కూడా విభిన్నంగా ఉండి ఆకట్టుకుంది. ఐతే ఆ ట్రైలర్లో వినిపించిన కొన్ని బూతులపై కొంత చర్చ జరిగింది. దీని గురించి ఈ చిత్ర సమర్పకుడు దగ్గుబాటి రానా స్పందించాడు. ఆ బూతుల విషయంలో మరోలా ఆలోచించవద్దని అతను కోరాడు..

‘‘మన దైనందిన జీవితంలో భాగంగా మన అసహాయనతను.. అసంతృప్తిని రకరకాల భావాల్లో వ్యక్త పరుస్తుంటాం. కొన్నిసార్లు బూతులూ మాట్లాడతం. ‘కంచరపాలెం’లోనూ అలాంటి సన్నివేశాలుంటాయి. సన్నివేశ పరంగా చూస్తే అదేం బూతు అనిపించదు. అంత సహజంగా ఉంటాయి ఆ డైలాగ్స్. ఆ సహజత్వం నచ్చే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ముందుకొచ్చా’’ అని రానా తెలిపాడు. ‘కేరాఫ్ కంచరపాలెం’ స్క్రిప్టు దశలోనే తమ దగ్గరికి వచ్చి ఉంటే ఇప్పుడున్నంత సహజంగా వచ్చేది కాదేమో అని రానా సందేహం వ్యక్తం చేశాడు. తామైతే సెట్ వేసి.. కొన్ని రంగులు అద్ది.. పేరున్న ఆర్టిస్టుల్ని తీసుకుని సినిమా తీసేవాళ్లమేమో అని.. కానీ దర్శకుడు అలా కాకుండా నిజంగా కంచరపాలెం గ్రామంలో అక్కడి వ్యక్తుల్నే నటీనటులుగా తీసుకుని సినిమా తీశాడని.. అందుకే ఇది చాలా సహజంగా.. స్వచ్ఛంగా తయారైందని.. ఇదొక హానెస్ట్ ఫిలిం అని రానా అన్నాడు. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని అతను ధీమా వ్యక్తం చేశాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు