హిట్టు కొట్టాడు.. పెళ్లి పీటలెక్కాడు

హిట్టు కొట్టాడు.. పెళ్లి పీటలెక్కాడు

సినీ రంగంలోకి అడుగుపెట్టే కుర్రాళ్లకు అంత సులువుగా పెళ్లి మీదికి మనసు మళ్లదు. ఇక్కడో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకుని తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాకే పెళ్లి వైపు అడుగులేస్తుంటారు. దర్శకుడు కావాలన్న కల నెరవేర్చుకున్నాక.. సక్సెస్ సాధించాక పెళ్లి చేసుకున్న యువ దర్శకులు గతంలో చాలామందే కనిపిస్తారు. ఈ జాబితాలోకి మరో యంగ్ డైరెక్టర్ చేరాడు. అతనే ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో ఇండస్ట్రీ దృష్టిని తన వైపు తిప్పుకున్న అజయ్ భూపతి.

రామ్ గోపాల్ వర్మ దగ్గర శిష్యరికం చేసి.. దర్శకుడిగా తొలి సినిమాతోనే తనదైన ముద్ర వేసిన అజయ్.. శనివారం చడీచప్పుడు లేకుండా లక్ష్మీ శిరీష అనే అమ్మాయిని పెళ్లాడాడు. గతంలో ప్రేమ విఫలమై జీవితంపై ఆశలు కోల్పోయిన తాను.. వర్మ శిష్యరికంతో మళ్లీ గాడిన పడ్డానని.. తర్వాత తనను నిజాయితీగా ప్రేమించే అమ్మాయి దొరికిందని.. ఆ అమ్మాయినే త్వరలో పెళ్లి చేసుకోబోతున్నానని.. అజయ్ కొన్ని రోజుల కిందటే చెప్పాడు. అలా చెప్పిన కొన్ని రోజులకే ఆ అమ్మాయిని పెళ్లాడేశాడు.

సినిమా తీయడంలో.. మాట్లాడటంలో రామ్ గోపాల్ వర్మ నుంచి చాలా విషయాలు అందిపుచ్చుకున్న అజయ్ భూపతి.. పెళ్లిని వ్యతిరేకించే వర్మ ఐడియాలజీని మాత్రం తీసుకున్నట్లు లేడు. వ్యక్తిగతంగా వర్మ కొన్ని విషయాల్లో తనకు నచ్చడని వర్మ మొహమాటం లేకుండా చెప్పేసిన సంగతి తెలిసిందే. పెళ్లి విషయంలో ఎలాంటి హడావుడి లేకుండా చూసుకున్న అజయ్.. ఇండస్ట్రీ జనాల్ని పెద్దగా ఆహ్వానించినట్లు కూడా లేడు. వివాహ వేడుక కూడా చాలా సింపుల్ గా సాగిపోయినట్లు అనిపిస్తుంది. తనే నేరుగా మీడియాకు పెళ్లి ఫొటోలు రిలీజ్ చేయడం ద్వారా ఈ విషయంలోనూ హడావుడి లేకుండా చూసుకుని తన విలక్షణతను చాటుకున్నాడు అజయ్ భూపతి. 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు