ఇళయరాజా పాటలు వదలనంటున్న బాలు

ఇళయరాజా పాటలు వదలనంటున్న బాలు

దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా.. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కలయికలో ఎన్ని వేల మధుర గీతాలు వచ్చాయో అందరికీ తెలిసిందే. వ్యక్తిగతంగానూ వీళ్లిద్దరి మధ్య గొప్ప అనుబంధం ఉంది. ఇళయరాజా తన సోదరుడు అంటుంటాడు బాలు. అలాగే చాలా తక్కువగా మాట్లాడే ఇళయరాజా సైతం బాలు మీద అవాజ్యమైన ప్రేమ చూపిస్తుంటాడు.

ఇంత గొప్ప అనుబంధం ఉన్నపపటికీ తన పాటల్ని కచేరీల్లో పాడటం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ బాలుకు ఇళయరాజా నోటీసులు పంపడం తీవ్ర దుమారమే రేపింది. ఇది సంగీత ప్రియులకు ఎంతో వేదన కలిగించింది. ఈ గొడవ సద్దుమణిగి ఇద్దరూ మళ్లీ దగ్గరైనట్లు వార్తలొచ్చాయి కానీ.. అందులో నిజమెంతో తెలియదు. ఈ విషయమై తాజాగా ఒక ఇంటర్వ్యూలో బాలు స్పందించారు.

ఎప్పట్లాగే ఆ నోటీసుల విషయంలో బాలు మరోసారి ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మిత్రుడి నుంచి అలాంటి స్పందన ఊహించలేదని ఆయన అన్నారు. ఐతే ఇళయరాజా నోటీసులు ఇచ్చినప్పటికీ తాను మాత్రం ఆయన పాటలు పాడటం ఆపలేదన్నారు. ముందు ఈ విషయంలో నొచ్చుకుని కొంతకాలం ఇళయరాజా పాటల్ని పాడటం ఆపేశానని.. కానీ తాను ఎక్కువ పాటలు పాడింది ఆయన సంగీత దర్శకత్వంలోనే అని.. కాబట్టి వాటిని అవాయిడ్ చేయడం తనకు సాధ్యం కాలేదని అన్నారు బాలు. ఇక రాయల్టీ విషయంలో ఎలా, ఎంత చెల్లించాలో ఇళయరాజా స్పష్టం చేయలేదన్నారు.

అలాగే సంగీత దర్శకుడిగా ఆయనకు ఒక పాట మీద హక్కు ఉంటే.. ఒక గాయకుడిగా తన పాటలు పాడుకునే హక్కు తనకుందని.. ఒకవేళ ఇళయరాజా మరోసారి చట్టపరమైన చర్యలకు సిద్ధపడితే.. తాను కూడా అలాగే చేస్తానని బాలు స్పష్టం చేశారు. అంతే తప్ప ఇళయరాజా పాటలు పాడటం ఆపబోనని ఆయన స్పష్టం చేశారు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు