దేవరకొండ.. ఏడాది ముందు.. తర్వాత

దేవరకొండ.. ఏడాది ముందు.. తర్వాత

పోయినేడాది ఇదే రోజు టాలీవుడ్ షేక్ అయిపోయింది. ‘అర్జున్ రెడ్డి’ అనే చిన్న సినిమా ప్రభంజనం సృష్టించింది. ఇండస్ట్రీ అంతటా ఈ చిత్రం గురించే చర్చ జరిగింది. చిన్న సినిమాలు పెద్ద విజయం సాధించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ ‘అర్జున్ రెడ్డి’ విజయం ప్రత్యేకమైంది. సినిమా తీయడంలో అప్పటిదాకా ఉన్న రూల్స్ అన్నింటినీ బ్రేక్ చేసి పారేశాడు సందీప్ రెడ్డి వంగా.

ఇక పెర్ఫామెన్స్ విషయం విజయ్ రేపిన సంచలనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒక చిన్న సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే.. పుంజుకుని అది మంచి వసూళ్లు సాధించడం.. పెద్ద సక్సెస్ సాధించడం మామూలే. కానీ రెండు సినిమాల అనుభవమున్న హీరో.. ఒక కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమా కోసం ప్రేక్షకులు వెర్రెత్తిపోవడం.. ముందు రోజే తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ప్రిమియర్లు వేస్తే దాని టికెట్ల కోసం విపరీతమైన డిమాండ్ నెలకొనడం.. ఎప్పుడూ చూడని అనుభవమే.

విడుదలకు ముందున్న అంచనాల్ని అందుకుంటూ ‘అర్జున్ రెడ్డి’ భారీ విజయాన్నే అందుకుంది. సరిగ్గా ఏడాది తర్వాత ఇప్పుడు కూడా టాలీవుడ్ బాక్సాఫీస్‌లో విజయ్ దేవరకొండ ప్రభంజనం కొనసాగుతుండటం విశేషం. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత విజయ్ నటించిన కొత్త సినిమా రావడానికి బాగానే లేటైంది. మధ్యలో ‘ఏ మంత్రం వేసావె’ అనే పాత సినిమా ఒకటి వదిలారు. దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఆ తర్వాత ‘ట్యాక్సీవాలా’ వేసవిలోనే రావాల్సింది. అది ఆగిపోయింది. ఐతే గ్యాప్ వస్తే ఏమైంది.. నిరీక్షణకు తగ్గట్లే అదిరిపోయే సినిమా పడింది.

‘గీత గోవిందం’తో తన అభిమానుల ఆకలి తీర్చేశాడు విజయ్. ఈ చిత్రానికి వచ్చిన ప్రి రిలీజ్ బజ్.. ఓపెనింగ్స్ అనూహ్యం. విజయ్ ఎంత పెద్ద స్టార్ అయిపోయాడో.. అతడి ఫాలోయింగ్ ఏంటో ఈ సినిమా రుజువు చేసింది. రెండో వారాంతంలోనూ జోరు కొనసాగిస్తూ రూ.50 కోట్ల షేర్ మార్కు దిశగా ‘గీత గోవిందం’ దూసుకెళ్తోంది. ఒకేసారి ఎన్నో మెట్లు ఎక్కేసి పెద్ద హీరోలకు పోటీ ఇచ్చే స్థాయికి చేరుకున్నాడు విజయ్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు