అనుష్క ‘సైలెన్స్’ అటాక్

అనుష్క ‘సైలెన్స్’ అటాక్

ఓవైపు నయనతార, త్రిష, శ్రియ లాంటి సీనియర్ హీరోయిన్లు వరుసబెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. వాళ్లతో పోలిస్తే అనుష్క క్రేజ్ తక్కువేమీ కాదు. దక్షిణాదిన నయన్ తర్వాత అంత స్టార్ ఇమేజ్ ఉన్నది అనుష్కకే. ఆమెకు అవకాశాలు రాకేమీ కాదు. కానీ అనుష్క మాత్రం తన దగ్గరికి వచ్చిన ప్రతి సినిమానూ ఒప్పుకోవట్లేదు. ఆచితూచి సినిమాలు ఎంచుకుంటోంది. చివరగా ‘భాగమతి’ రూపంలో మంచి విజయాన్నందుకుంది అనుష్క. ఆ తర్వాత అనుష్క కొత్త సినిమా దేని గురించీ ప్రకటన రాలేదు. గౌతమ్ మీనన్ సినిమా అన్నారు కానీ.. అది అటకెక్కేసింది. ఐతే అనుష్క ప్రస్తుతం చడీచప్పుడు లేకుండా ఓ సినిమాలో నటించేస్తున్నట్లు సమాచారం. ఆ సినిమాకు ‘సైలెన్స్’ అనే టైటిల్ కూడా ఖరారైనట్లు తెలుస్తోంది.


ఇంతకుముందు మంచు విష్ణు హీరోగా ‘వస్తాడు నా రాజు’ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమైన హేమంత్ మధుకర్ తీస్తున్న కొత్త సినిమా ఇదట. ఇందులో అనుష్కకు జోడీగా తమిళ విలక్షణ నటుడు మాధవన్ నటిస్తున్నట్లు సమాచారం. ఇన్నేళ్ల కెరీర్లో ఎప్పుడూ డైరెక్ట్ తెలుగు సినిమాలో నటించని మాధవన్.. ఇటీవలే ‘సవ్యసాచి’లో ఓ కీలక పాత్ర పోషించాడు. దాని తర్వాత అతను నటిస్తున్న తెలుగు చిత్రమిదే. దీన్ని తమిళంలోనూ ఒకేసారి రూపొందిస్తున్నారు. మాధవన్-అనుష్క కలిసి నటించడం ఇది తొలిసారేమీ కాదు. వీళ్లిద్దరూ తమ కెరీర్ ఆరంభంలో ‘రెండు’ అనే సినిమా చేశారు. అందులో అనుష్క చాలా హాట్ హాట్‌గా కనిపించింది కూడా. ఇప్పుడు 12 ఏళ్ల విరామం తర్వాత వీళ్లిద్దరూ కలిసి నటిస్తుండటం విశేషం. ఈసారి ఇద్దరూ నటనకు ప్రాధాన్యమున్న మెచ్యూర్డ్ రోల్స్ చేస్తున్నారట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English