‘హీరో’ కాబోయే హీరో ఎవరబ్బా?

‘హీరో’ కాబోయే హీరో ఎవరబ్బా?

టాలీవుడ్లో ఇప్పుడు మాంచి ఊపుమీదున్న బేనర్లలో ‘మైత్రీ మూవీ మేకర్స్’ ఒకటి. తొలి సినిమా ‘శ్రీమంతుడు’తోనే బ్లాక్ బస్టర్ హిట్‌తో ఇండస్ట్రీలోకి ఘనమైన అరంగేట్రం చేసిందా సంస్థ. ఆ తర్వాత ‘జనతా గ్యారేజ్’ రూపంలో మరో భారీ విజయాన్నందుకున్న ఈ సంస్థ..  ఈ ఏడాది ‘రంగస్థలం’లో మెగా సక్సెస్ కొట్టింది. దీంతో ఈ సంస్థ పేరు మార్మోగిపోయింది.

ఇప్పుడు టాలీవుడ్లో ఈ సంస్థ ఉన్న ఊపులో మరేదీ లేదు. దాదాపు పది దాకా సినిమాల్ని ‘మైత్రీ మూవీ మేకర్స్’ లైన్లో పెట్టడం విశేషం. ప్రస్తుతం చివరి దశలో ఉన్న ‘సవ్యసాచి’తో పాటు రవితేజ-శ్రీను వైట్లల ‘అమర్ అక్బర్ ఆంటోనీ’.. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ‘డియర్ కామ్రేడ్’.. ఈ సంస్థలో తెరకెక్కుతున్న చిత్రాలే. ఇంకా సుకుమార్-మహేష్ బాబు సినిమాను కూడా అనౌన్స్ చేశారు. ఇవి కాక పలు ప్రాజెక్టులపై చర్చలు నడుస్తున్నాయి.

తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ ఒక ఆసక్తికర టైటిల్‌ను ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ చేయించింది. ఆ పేరు.. హీరో. గతంలో మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా ‘హీరో’ అనే సూపర్ హిట్ మూవీ వచ్చింది. ఆ తర్వాత నితిన్ హీరోగా ‘హీరో’ అనే డిజాస్టర్ వచ్చింది. ఇప్పుడు కొత్తగా టాలీవుడ్లో ‘హీరో’ కాబోయే కథానాయకుడెవరా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నితిన్ వాడిన టైటిల్‌ను మహేష్-సుకుమార్ సినిమాకు ఉపయోగిస్తారని ఎవరూ అనుకోవట్లేదు.

సాయిధరమ్ తేజ్ హీరోగా ఈ సంస్థలో కిషోర్ తిరుమల ఓ సినిమా తీయాల్సి ఉంది. ఎలాగూ మేనమామ సినిమా టైటిలే కాబట్టి తేజు ఏమైనా ఈ పేరును వాడుకుంటాడేమో అని సందేహాలు కలుగుతున్నాయి. ఐతే క్లాస్ సినిమాల దర్శకుడిగా పేరున్న కిషోర్.. తేజుతో తన స్టయిల్లోనే ‘చిత్రలహరి’ తీస్తాడని ఆ మధ్య వార్తలొచ్చాయి. మరి వీళ్ల సినిమాకు కాకుండా ‘హీరో’ టైటిల్ ఏ కాంబినేషన్ కోసం రిజిస్టర్ చేయించినట్లో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు