కొత్త సినిమాలకు షాక్

కొత్త సినిమాలకు షాక్

అనుకున్నదే అయింది. ముందు వారం విడుదలైన సినిమా ధాటికి ఈ వారం వచ్చిన కొత్త సినిమాలు తట్టుకోలేకపోయాయి. ‘గీత గోవిందం’ ఇప్పటికీ బాక్సాఫీస్ లీడర్‌గా కొనసాగుతోంది. ఈ శుక్రవారం ఒకటికి నాలుగు సినిమాలు రిలీజయ్యాయి.

వీటిలో దేని మీదా ఎక్కువ అంచనాల్లేవు. ‘గీత గోవిందం’ను దెబ్బ తీసే సినిమా అవుతుందని దేని మీదా అంచనా లేదు. కాకపోతే వాటి వరకు ఉనికిని చాటుకుంటాయా అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. అదేమీ జరగలేదు. ‘గీత గోవిందం’ ధాటికి ఇవి కుదేలైపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఈ శుక్రవారం రిలీజైన నాలుగు సినిమాల్లో దేనికీ పాజిటివ్ టాక్ లేదు. కనీసం వాటికి ఓపెనింగ్స్ కూడా సరిగా లేవు.

ఉన్నంతలో ‘నీవెవరో’ పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉంటుందని ఆశించారు. దీని టీజర్, ట్రైలర్ బాగానే అనిపించాయి. కానీ వాటిని కట్ చేయడంలో చూపించిన నేర్పు సినిమాలో కనిపించలేదు. దీనికి అన్ని వైపులా నెగెటివ్ టాకే వచ్చింది.

ఇక నారా రోహిత్-జగపతిబాబుల ‘ఆటగాళ్ళు’ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అసలే అంచనాల్లేకుండా వచ్చిన ఈ చిత్రం అందుకు తగ్గట్లే బ్యాడ్ టాక్ తెచ్చుకుంది.

ఇక రష్మి గౌతమ్ సినిమా ‘అంతకుమించి’.. ప్రభుదేవా డబ్బింగ్ మూవీ ‘లక్ష్మి’ గురించి మాట్లాడేవాళ్లు లేరు. రష్మి కుర్రాళ్లను ఓ మోస్తరుగా థియేటర్లకు రప్పించగలిగింది. కాకపోతే సినిమాలో విషయం లేదని తేల్చేశారు.

‘లక్ష్మి’ సినిమా పరిస్థితి దయనీయంగా ఉంది. పడ్డవే చాలా తక్కువ షోలంటే వాటికి కూడా జనాల్లేరు. ఇది కొంచెం విషయమున్న సినిమానే అయినా జనాలు దాని పట్ల అసలేమాత్రం ఆసక్తి చూపించట్లేదు. మరోవైపు ‘గీత గోవిందం’ రెండో వీకెండ్లోనూ హౌస్ ఫుల్ వసూళ్లతో రన్ అవుతోంది. కొత్త సినిమాలు దాని ముందు వెలవెలబోతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు