‘సైరా’ డైలాగ్ లీక్ చేసిన పరుచూరి

‘సైరా’ డైలాగ్ లీక్ చేసిన పరుచూరి

మొన్న రిలీజైన ‘సైరా నరసింహారెడ్డి’లో మెగాస్టార్ చిరంజీవి చిన్న డైలాగే చెప్పాడు. ‘ఈ యుద్ధం ఎవరిది’ అని చిరు అంటే అతడి సైన్యం ‘మనది’ అంటుంది. టీజర్లో అంతకుమించి డైలాగులేమీ లేవు. ఐతే ఈ చిత్రానికి పరుచూరి సోదరులతో పాటు సాయిమాధవ్ రచన చేయడంతో భారీ డైలాగులే ఉంటాయని.. అవి అభిమానుల్ని ఉర్రూతలూగిస్తాయని భావిస్తున్నారు. చిత్ర రచయితల్లో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ ఈ సినిమా నుంచి చాలా ముందుగానే ఒక కీలకమైన డైలాగ్ లీక్ చేయడం విశేషం.

‘‘చేతులు వెనక్కి విరిచి కట్టేశాం. ముఖం ముందు ఉరితాడు వేలాడుతోంది. ఏంటిరా? ఆ ధైర్యం.. చావు భయం లేదా నీకు?’’ అని బ్రిటిష్ అధికారి అంటే.. ‘‘చచ్చి పుట్టినవాడిని.. చనిపోయిన తర్వాత కూడా బతికే వాడిని. చావంటే నాకెందుకురా భయం’’ అని చిరు డైలాగ్ పేలుస్తాడట సినిమాలో. బహుశా ఈ డైలాగుతోనే సినిమా ముగిసే అవకాశాలు కనిపిస్తాయి. ఉయ్యాలవాడను బ్రిటిష్ వాళ్లు ఉరి తీసిన సంగతి తెలిసిందే. ఈ చిన్న డైలాగ్‌ అభిమానుల కోసం లీక్‌ చేశానని.. ఇందుకు చిరంజీవిగారు కోప్పడతారేమో తెలియదని పరుచూరి చెప్పడం విశేషం.

ఇక సినిమా విశేషాలపై పరుచూరి మాట్లాడుతూ.. టీజర్‌ చూస్తే చిరంజీవి నటనంతా ఆయన కళ్లలోనే కనిపిస్తుందని అన్నారు. అద్భుతమైన కథకి.. గొప్ప సంభాషణలు, సంగీతం, కెమెరా పనితనం తోడైతే విజయం తప్పనిసరి అని చెప్పారు. తాము 356 సినిమాలకు రచన చేశామని.. ఐతే ఏ సినిమా రాసినందుకు ఆనందంగా ఉందంటే ఓ 15-20 సినిమాలు గుర్తుకొస్తాయని.. అలాగే ఏ సినిమా రాసినందుకు గర్వపడుతున్నావంటే మాత్రం ‘సైరా నరసింహారెడ్డి’ పేరు చెబుతానని గోపాలకృష్ణ అన్నారు. ఈ సినిమా కోసం 12 ఏళ్లు ఆగామని.. సురేందర్‌రెడ్డిలాంటి అద్భుతమైన దర్శకుడు దొరకడం.. అమితాబ్‌ బచ్చన్‌, జగపతిబాబులాంటి మంచి నటులు సమకూరడంతో సినిమా గొప్పగా తయారవుతోందని ఆయన చెప్పారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు