భార్యాభర్తల పోరు తప్పదా?

భార్యాభర్తల పోరు తప్పదా?

ఆగస్టు 31న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన సినిమా ‘శైలజా రెడ్డి అల్లుడు’. నెల రోజుల ముందే రిలీజ్ డేట్ ఇచ్చి.. చక్కగా పోస్ట్ ప్రొడక్షన్ పనులుచేసుకుంటూ.. ప్రమోషన్లు కూడా కానిస్తూ సినిమాను విడుదలకు సిద్ధం చేస్తూ వచ్చింది చిత్ర బృందం. కానీ కేరళ వరదల కారణంగా సంగీత దర్శకుడు గోపీసుందర్ బ్యాగ్రౌండ్ స్కోర్ పని సకాలంలో పూర్తి చేయలేకపోవడంతో సినిమాను వాయిదా వేయక తప్పలేదు. కానీ ఇప్పుడు ఈ చిత్రానికి సరైన డేట్ ఎంచుకోవడం కష్టమవుతోంది.

‘శైలజా రెడ్డి అల్లుడు’ వచ్చిన రెండు వారాలకు సమంత సినిమా ‘యు టర్న్’.. ఆ తర్వాత రెండు వారాలకు నాగ్ మూవీ ‘దేవదాస్’ను షెడ్యూల్ చేసి పెట్టుకున్నారు. దీంతో ‘అల్లుడు’ సినిమాకు కొత్తగా ఏ డేట్ ఎంచుకోవాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. సెప్టెంబరును వదిలేసి అక్టోబరుకు వెళ్దామంటే అక్కడ భారీ సినిమాలు కాచుకుని ఉన్నాయి.

కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే నెలలోనే సినిమాను రిలీజ్ చేయాలి. కేరళలో పరిస్థితులు మెరుగై గోపీసుందర్ బ్యాలెన్స్ వర్క్ పూర్తి చేసే పనిలో పడ్డట్లు సమాచారం. కొన్ని రోజుల్లోనే వర్క్ అంతా ఫినిష్ అవుతుందట. కావాలంటే సెప్టెంబరు 7నే ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేయొచ్చు. కానీ ఆ రోజుకు మూడు చిన్న సినిమాలు షెడ్యూల్ అయి ఉన్నాయి. వీళ్లు ఆ డేట్ తీసుకుంటే వాళ్లకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇది సమంజసం కాదు. ఈ నేపథ్యంలో వినాయక చవితి కానుకగా సెప్టెంబరు 13నే ఈ చిత్రాన్ని రిలీజ్ చేద్దామా అని చూస్తున్నట్లు సమాచారం.

సమంత సినిమాతో క్లాష్ వస్తుంది కానీ.. ‘యు టర్న్’.. ‘శైలజా రెడ్డి అల్లుడు’ చిత్రాలు భిన్నమైన జానర్లలో తెరకెక్కిన సినిమాలు కాబట్టి ఇబ్బంది ఏమీ ఉండదని.. ఫెస్టివల్ వీకెండ్ కాబట్టి కలెక్షన్లకు ఢోకా కూడా ఉండదని భావిస్తున్నారట.

పోటీలో సుధీర్ బాబు సినిమా ‘నన్ను దోచుకుందువటే’ కూడా ఉన్నప్పటికీ మూడు సినిమాలకూ స్కోప్ ఉంటుందనే అనుకుంటున్నారట. ఈ ఏడాది వేసవిలో సమంత సినిమాలు ‘మహానటి’.. ‘ఇరుంబు తిరై’ ఒకే వారాంతంలో రిలీజయ్యాయి. మరి ఆమె సినిమాలు రెండు ఒకేసారి రిలీజైనపుడు భార్యాభర్తల సినిమాలు.. అందులోనూ ఒకదానితో ఒకటి సంబంధం లేనివి రిలీజైతే తప్పేముందని అంటున్నారట. ‘శైలజా రెడ్డి అల్లుడు’ వెబ్ యాడ్స్ లో ‘ఫెస్టివల్ రిలీజ్’ అని పేర్కొనడం ఈ సందేహాలకు మరింత బలమిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు