పరశురామ్ ఇలా ఇరుక్కున్నాడేంటి?

పరశురామ్ ఇలా ఇరుక్కున్నాడేంటి?

‘గీత గోవిందం’తో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు దర్శకుడు పరశురామ్. తొలి సినిమా ‘యువత’తోనే టాలెంట్ చూపించినప్పటికీ ఇప్పటిదాకా అతడి కెరీర్లో పెద్ద హిట్ లేదు. ‘సోలో’.. ‘శ్రీరస్తు శుభమస్తు’ బాగానే ఆడాయి కానీ.. పెద్ద విజయాలైతే అందుకోలేదు. ఆ లోటును ‘గీత గోవిందం’ తీర్చేసింది. ఈ సినిమా చూశాక పెద్ద హీరోలు కూడా అతడితో సినిమా చేయడానికి ముందుకు వస్తారని భావిస్తున్నారు. కానీ పరశురామ్ మాత్రం తాను ఆశించిన స్థాయి హీరోలతో పని చేయలేని విధంగా ఇరుక్కున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘శ్రీరస్తు శుభమస్తు’ టైంలోనే అతను మంచు ఫ్యామిలీ నుంచి ఓ సినిమాకు అడ్వాన్స్ తీసుకున్నట్లుగా వార్తలొచ్చాయి. కొంచెం ముందో వెనుకో మంచు విష్ణుతో సినిమా చేయక తప్పని స్థితిలో ఉన్నాడతను. మంచు విష్ణు ట్రాక్ రికార్డేంటన్నది తెలిసిందే.

ఇక ‘గీతా ఆర్ట్స్’ బేనర్లోనే తన తర్వాతి సినిమా చేయడానికి అతను ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ బేనర్లో ఇప్పటిదాకా ఏ దర్శకుడికీ వరుసగా మూడు సినిమాలు చేసే అవకాశం దక్కలేదని.. ఇది పరశురామ్ అదృష్టమని బన్నీ వాసు లాంటి వాళ్లు అంటున్నారు. కానీ సినిమా అయితే కన్ఫమ్ అయింది కానీ.. అందులో పేరున్న హీరో ఎవరూ నటించే అవకాశాలు లేవట. పరశురామ్.. బన్నీ లాంటి హీరోను కోరుకుంటుంటే.. అల్లు అరవిందేమో మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌తో సినిమా చేయమని అంటున్నాడట. తేజు కెరీర్ గత కొన్నేళ్లలో బాగా డౌని అయిపోయింది. చివరిగా వచ్చిన ‘తేజ్ ఐ లవ్యూ’ కూడా డిజాస్టర్ అయింది. ఈ స్థితిలో అతడి కెరీర్‌ను చక్కదిద్దాలని చిరు.. అరవింద్‌కు బాధ్యత అప్పగించారట. ఆయన పరశురామ్‌తో ఒక సినిమా చేయించి తేజు కెరీర్‌ను గాడిలో పెడదామని చూస్తున్నారట. పరశురామ్‌ అయిష్టంగానే ఈ సినిమాకు ఒప్పుకోక తప్పని స్థితిలో ఉన్నాడట. ‘గీత గోవిందం’తో తన కెరీర్ మరో స్థాయికి వెళ్తుందనుకుంటే.. వరుసగా ఫ్లాప్ హీరోలతో సినిమాలు చేయాల్సి రావడం అతడికెలాంటి ఫీలింగ్ కలిగిస్తుందో చెప్పేదేముంది?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు