రాజశేఖర్ కొత్త సినిమా టైటిల్ అదే..

రాజశేఖర్ కొత్త సినిమా టైటిల్ అదే..

‘గరుడవేగ’తో మళ్లీ ఫామ్ అందుకున్న సీనియర్ హీరో రాజశేఖర్.. ‘అ!’ అనే వైవిధ్యమైన చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్ర ప్రి లుక్ లాంచ్ చేశారు. అది చాలా ఆసక్తికరంగా ఉండి జనాల్లో క్యూరియాసిటీని పెంచింది. రాఖీ పండుగ కానుకగా ఈ ఆదివారం ఈ చిత్ర టైటిల్ ప్రకటించబోతున్నారు. ఐతే ఈ లోపే ఆ టైటిలేంటో లీక్ అయిపోయింది. ఈ చిత్రానికి ‘కల్కి’ అనే పేరు ఖరారు చేసినట్లు సమాచారం. ఈ టైటిలే ఆదివారం ప్రకటించబోతున్నారట. ప్రి లుక్ పోస్టర్‌కు తగ్గట్లే ఇది కూడా ఆసక్తి రేకెత్తించేలాగే ఉంది.


ఈ చిత్ర బ్యాక్ డ్రాప్ ఏంటి.. కథ ఎలా ఉంటుందన్నది ప్రి లుక్ పోస్టర్లోనే దాదాపుగా చెప్పేశారు. ఒకఇంగ్లిష్ న్యూస్ పేపర్ కవర్ పేజీ బ్యాక్ డ్రాప్‌లో ప్రి లుక్ పోస్టర్ డిజైన్ చేశారు. అందులో 1983 వన్డే క్రికెట్ ప్రపంచకప్ అందుకుంటున్న కపిల్ ఫొటో ఉంది. అలాగే ఖైదీ సినిమా రిలీజ్ పోస్టర్ ఉంది. దీన్ని బట్టి ఇది 1983వ సంవత్సరంలో జరిగే కథ అని అర్థమవుతోంది. అలాగే ‘హు ఈజ్ ద మర్డరర్’ అని అందులో ఒక హెడ్డింగ్ ఉంది. కాబట్టి ఇదొక మర్డర్ మిస్టరీ. రాజశేఖర్ కెరీర్లో అత్యధికసార్లు చేసింది పోలీస్ క్యారెక్టరే. ఇందులోనూ ఆయన ఆ పాత్రే చేయబోతున్నట్లు తెలుస్తోంది. ‘గరుడవేగ’ తర్వాత తొందరపడకుండా ఈ సీనియర్ హీరో మంచి ప్రాజెక్టే ఎంచుకున్నట్లున్నాడు. కాకపోతే ఈసారి ఆ సినిమాలా బడ్జెట్ హద్దులు దాటిపోకుండా చూసుకోవడం కీలకం. ఈ చిత్రంలో పని చేసే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు కూడా ఆదివారమే ప్రకటించనున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు